ఆపరేషన్ టైగర్ Vs ఆపరేషన్ దేవేంద్ర.. మహారాష్ట్ర పాలిటిక్స్ లో తీవ్ర దుమారం

by Prasad Jukanti |

మహారాష్టర్ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఉద్ధవ్ థాక్రే చేసిన ఆపరేషన్ దేవేంద్ర వ్యాఖ్యలకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఆపరేషన్ టైగర్ Vs ఆపరేషన్ దేవేంద్ర.. మహారాష్ట్ర పాలిటిక్స్ లో తీవ్ర దుమారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఇటీవల శివసేన (UBT) నుంచి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు ఏకనాథ్ షిండే వర్గంలో చేరేందుకు చేపట్టిన 'ఆపరేషన్ టైగర్' సక్సెస్ కాగా ఇప్పుడు 'ఆపరేషన్ దేవేంద్ర' హాట్ టాపిక్‍గా మారింది. తన వర్గం ఎంపీలను ఫిరాయించడంపై నిన్న జరిగిన ఒక ర్యాలీలో ఉద్ధవ్ థాక్రే స్పందిస్తూ ఇది నిజానికి ఆపరేషన్ టైగర్ కాదని భవిష్యత్తులో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధానమంత్రి రేసులోకి రాకుండా ఆయన రెక్కలు కత్తిరించేందుకు సాగుతున్న 'ఆపరేషన్ దేవేంద్ర' అంటూ వ్యాఖ్యానించారు. థాక్రే చేసిన ఈ వ్యాఖ్యలకు ఆదివారం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు.

నేనేమీ పక్షిని కాను:

ఆదివారం పాల్ఘర్ జిల్లాలో వాధవన్ పోర్టు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఫడ్నవీస్ ఆపరేషన్ దేవేంద్ర వ్యాఖ్యలపై స్పందించారు. 'నేనేమీ పక్షిని కాను. నాకు రెక్కలు లేవు. అలాంటప్పుడు నా రెక్కలను ఎవరు కత్తిరించగలరు? నాకు మహారాష్ట్రలోని 14 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు, మా పార్టీ సీనియర్ నేతల మద్దతు ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. నాకు రాజకీయ అంశాల కంటే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం' అని కౌంటర్ ఇచ్చారు.

ఒకే ఫ్లైట్‌లో జర్నీపై:

గత శుక్రవారం ముంబయి నుంచి నాగ్‌పూర్ వెళ్లే విమానంలో దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే ఒకేసారి ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇద్దరు ఒకే విమానంలో ప్రయాణించడం వెనుక ఏదో ఉందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం అంతా వెర్రితనం అని అభివర్ణించారు. ఇద్దరు నేతలు ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించడంలో వింతేమీ లేదని, అది కేవలం ఒక కాకతాళీయం మాత్రమే జరిగిందన్నారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఫడ్నవీస్ నిస్సాహాయుడిగా కనిపించారన్న థాక్రే ఆరోపణలను సైతం సీఎం తిప్పికొట్టారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యే వరకు నా మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న సినిమా లేదా వెబ్ సిరీస్ చూస్తూ గడిపాను. అలాంటప్పుడు నా ముఖంలో ఆ నిస్సహాయత ఎక్కడ కనిపించింది? అని ప్రశ్నించారు. తామిద్దరం విమానంలో వేర్వేరు మూలల్లో కూర్చున్నామని, ఒకవేళ పక్కపక్కనే కూర్చుని ఉంటే కాసేపు మాట్లాడుకునేవాళ్లమని, అందులో తప్పేముందన్నారు. అయితే ఆపరేషన్ టైగర్ నేపథ్యంలో శివసేన లేవనెత్తిన ఆపరేషన్ దేవేంద్ర వ్యూహం మహారాష్ట్ర రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పబోతోందో చూడాలి మరి.

Next Story