రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

by Kema Shiva Kumar |

తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

రేవంత్‌రెడ్డికి పాలన చేతకావడం లేదు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ రేవంత్ రాష్ట్ర పాలనను వదిలిపెట్టారని అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వాటి అమలును పూర్తిగా విస్మరించారన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పూర్తిగా అబద్ధాల మీద పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెబుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతున్నదని ఆరోపించారు. అయితే.. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించామని పేర్కొన్నారు. రేవంత్ రెండేళ్లలో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని ప్రశ్నించారు. ఆ అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా? సంక్షేమంపై ఖర్చు చేశారా? అని నిలదీశారు.

మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలి

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని కేటీఅర్ పిలుపునిచ్చారు. రెండేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయం సాధించాలని అన్నారు. ప్రజలను పట్టించుకునే తీరిక, ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.. అందుకే ఇచ్చిన హమీలను తుంగలో తొక్కిందని అన్నారు. అన్నివర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజకు బీఆర్ఎస్ వెంట నిలబడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. తిరిగి పార్టీలోకి వచ్చిన ఆరూరి రమేశ్‌కు కేటీఆర్ స్వాగతం పలికారు. రమేశ్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన 16 ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.

రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైంది.. హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిన నాయకుడు కేటీఆర్ అని.. రమేశ్‌తో తనకు స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నిక నుంచి అనుబంధం ఉందని అన్నారు. రాష్ట్రం మొత్తం కేసీఆర్ దిక్కే చూస్తున్నదని.. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా అని అన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలకు భద్రత, భరోసా లేదని చెప్పారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని.. రైతుబంధు పడుతుందో లేదో చెప్పే దిక్కులేదని అన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ప్రతీ రాత్రి భయపడుతూ పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని అంటున్నారని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని.. 20 లక్షల విద్యార్థుల చదువు ఆగం చేసిన వ్యక్తి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. గౌడన్నలకు ఇస్తామన్న భరోసా ఊసేలేదన్నారు. వీటిని చూసి రమేశ్ సొంత గూటికి వచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో భూముల రేట్లు పడిపోయాయన్నారు. వర్ధన్నపేటలో మళ్ళీ గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు బహుమతి ఇవ్వాలని పిలుపునిచ్చారు.

Next Story