తెలంగాణ మున్సిపాలిటీల్లో తీవ్ర సిబ్బంది కొరత: కుంటుపడుతున్న పట్టణాభివృద్ధి

by Malleboina Mahesh |

మున్సిపాలిటీలు పెరిగినా ఇంజినీర్ల సంఖ్య పెరగక 60% ఖాళీలతో పనుల నాణ్యత దెబ్బతింటోంది. 999 పోస్టుల భర్తీపై ప్రభుత్వం స్పందించడం లేదు.

తెలంగాణ మున్సిపాలిటీల్లో తీవ్ర సిబ్బంది కొరత: కుంటుపడుతున్న పట్టణాభివృద్ధి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పట్టణీకరణ వేగంగా పెరుగుతుంటే అందుకు అనుగుణంగా ఇంజినీరింగ్ వ్యవస్థ బలోపేతం కాకపోవడం వల్ల మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయి. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. 2014 నుంచి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వాలు ఉద్యోగుల సంఖ్యను పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహించాయి. నీటిపారుదల, రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రీ-ఆర్గనైజ్ చేసినా.. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఇంజినీర్ల సంఖ్యను మాత్రం పెంచలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీఆర్ఎస్ విధానాలనే కొనసాగిస్తోంది. ఇంజినీర్ల సంఖ్య పెంచాలని పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి పలుమార్లు ప్రతిపాదనలు పంపించినా ఫలితం లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

2013 నుంచి..

కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలకు ఉన్న ఆసక్తి పోస్టులను పెంచడంలో లేకుండాపోయింది. 2013లో కొత్తగా ఏర్పడిన అనేక మున్సిపాలిటీలకు నేటికీ సొంత ‘శాంక్షన్ పోస్టులు’ లేవంటే మున్సిపల్ పరిపాలన శాఖపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి అధికారులను డిప్యుటేషన్ లేదా ఎఫ్ఏసీపై పంపాల్సి వస్తుంది. 13 ఏండ్లు గడిచినా శాశ్వత సిబ్బంది లేకపోవడం వల్ల ఆయా పట్టణాల అభివృద్ధి ప్రణాళికలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.

ఖాళీలు, ఎఫ్ఏసీ సంస్కృతి పెరిగిపోయింది. సగటున 40 శాతం -60శాతం ఖాళీలు ఉండటంతో ఒక అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) రెండు, మూడు మున్సిపాలిటీలను చూడాల్సి వస్తోంది. ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచడమే కాకుండా పని నాణ్యతను తగ్గిస్తోంది. ప్రస్తుతం ఉన్న మంజూరైన పోస్టులు దశాబ్దాల క్రితం నాటి జనాభా లెక్కల ప్రకారం ఉన్నాయి. పట్టణ జనాభా రెట్టింపు అయినా, సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు.

ప్రభుత్వానికి లేఖలు..

పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్, వరంగల్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో వరంగల్ సర్కిల్ పరిధిలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం డివిజన్లు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ క్వాలిటీ కంట్రోల్ డివిజన్‌లు ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజినీరింగ్(పీహెచ్అండ్ ఎంఈ) విభాగానికి 999 పోస్టులు కావాలని పలుమార్లు ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. కానీ పోస్టులు మాత్రం భర్తీ కావడం లేదు. కొత్త మున్సిపాలిటీలకు 453 ఇంజినీరింగ్ పోస్టులు, పీహెచ్ విభాగానికి 187, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు 113, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 132 మంది కావాలని లేఖ రాశారు.

ముఖ్యంగా 453 ఇంజినీరింగ్ పోస్టులో సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) 5, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) 10, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) 131, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) 138, అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) 124 పోస్టులతోపాటు ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) 7, డీఈఈ -3, ఏఈ 35 మందికి ఎంత ఖర్చు అవుతుందో ఫైనాన్సియల్ లెక్కలు కూడా వేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం లో ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంజినీర్లపై తీవ్ర ఒత్తిడి..

క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఒక్కో ఇంజినీర్‌కు రెండు, మూడు మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో నాణ్యత లోపం, క్షేత్రస్థాయి తనిఖీలకు ఏఈలు సమయం కేటాయించలేకపోవడం వల్ల రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల్లో నాణ్యత దెబ్బతింటోంది. నిధుల నిర్వహణ 15వ ఆర్థిక సంఘం వంటి కేంద్ర నిధులకు సంబంధించి వినియోగ పత్రాలు (యూసీలు) సకాలంలో అందక తదుపరి నిధులు నిలిచిపోతున్నాయి. పెండింగ్ బిల్లులకు సంబంధించిన ఎంబీల రికార్డింగ్ ఆలస్యం కావడం వల్ల కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఆగిపోయి, పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి.

ప్రజా ఫిర్యాదులు నీటి సరఫరా, వీధిదీపాలు, డ్రైనేజీ లీకేజీల వంటి అత్యవసర సమస్యలపై నిర్ణయం తీసుకునే అధికారి అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్లు ఒత్తిడి చేస్తుంటే.. ఎంబీ రికార్డు చేయకపోవడంతో తమ బిల్లులు రావడంలేదని కాంట్రాక్టర్లు సైతం ఒత్తిడికి గురి చేస్తున్నారని పలువురు ఇంజినీర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story