రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం

by Ratna Kumari |   (  Updated:2026-06-24 11:39:51  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యూవల్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యూవల్ సీఎం
X

దిశ, సత్తుపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని.. రెన్యూవల్ సీఎం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ అవగాహన సదస్సు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోగా, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు.

రెండున్నరేళ్లు గడుస్తున్నా అభివృద్ధి శూన్యం..

ఈ సందర్భంగా ఎంఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 72 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు ఢిల్లీకి వెళ్లి, అక్కడి పెద్దలకు కప్పం కడుతూ గులాంగిరి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా తెలంగాణ ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, సీతారామ ప్రాజెక్టు పనుల్లో 80 శాతం పూర్తిచేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్, గురుకులాల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు.

ముగ్గురు మంత్రులు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి..

రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ, పేదల ఇళ్ల కూల్చివేతలకు పాల్పడుతోందని ఆరోపించిన కేటీఆర్, ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఈ రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. TGIIIC భూముల కేటాయింపుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఎకరానికి తక్కువ ధరకు భూములు కేటాయించడం వెనుక ఎవరి హస్తం ఉందో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే సీతారామ ప్రాజెక్టు మట్టిని అక్రమంగా తరలించడంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story