తెలంగాణ ఉద్యమంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు

by Ratna Kumari |

తెలంగాణ ఉద్యమంపై మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు
X

దిశ, మిడ్జిల్ : తెలంగాణ ఉద్యమంపై మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. "నువ్వు ఎన్నడూ 'జై తెలంగాణ' అనలేదు.. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలేదు" అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకుడు మన్యం వెంకట్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి రాజీనామా చేసింది మాజీ మంత్రి లక్ష్మారెడ్డేనని గుర్తు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాలకు తరలిస్తూ "బాబు జపం" చేస్తున్నారని విమర్శించారు. మిడ్జిల్ ప్రాంతానికి నేడు సాగునీరు అందుతోందంటే అది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి కృషి ఫలితమేనని కొనియాడారు. చిల్వేర్ గ్రామం వద్ద దుందుభి వాగుపై నిర్మించిన వంతెన పనులను వేగవంతం చేసేందుకు తాము రాత్రింబవళ్లు కృషి చేశామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు కావస్తున్నా ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేదని విమర్శించారు. సర్పంచ్ రాధిక భర్త, దివంగత నాయకుడు మన్యం వెంకట్ రెడ్డి గ్రామ అభివృద్ధికి విశేష సేవలు అందించారని హరీశ్ రావు కొనియాడారు. ఆయన పట్ల కార్యకర్తలు చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌ళ్లీ అధికారంలోకి వస్తారని, వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్‌దేనని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం నుంచి మన్యం బాల్ రెడ్డి కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాండు, జిల్లా నాయకులు సుధా బాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, జంగి రెడ్డి, సుదర్శన్, బాలు, శ్రీనివాసులు, గంజి కృష్ణ, నారాయణరెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్ సాగర్, భీమ్ రాజు, గంజి శేఖర్, మల్లేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story