- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీ పుట్టినరోజే రైతు డిక్లరేషన్‌ను బొంద పెట్టిన రేవంత్ రెడ్డి : హరీష్ రావు
రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టినరోజు రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్‌ను బొంద పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రైతు డిక్లరేషన్ ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టినరోజు రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్‌ను బొంద పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. బోనస్‌కు మంగళం పాడిందని, రైతు బంధును ఎగనామం పెట్టిందని ఆరోపించారు. యూపీ పేరుతో, ఎకరానికి రెండు బస్తాల యూరియా పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు.
అధికారంలో లేనప్పుడు అన్ని పంటలను కొనుగోలు చేస్తామని, అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటలను, కేంద్ర ప్రభుత్వం ఎంత మేర కొనుగోలు చేస్తుందో అంత మేర మాత్రమే కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ సమావేశం అనంతరం ప్రకటించడం రైతులను నమ్మించి గొంతు కోసినట్లేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న పంటలను కొనుగోలు చేయదని, పప్పు దినుసులు, నూనె విత్తనాల పంటలను కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ లెక్కన మిగిలిన పంట ఉత్పత్తులను రైతులు దళారులకు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయమంటున్నారు సరే, ఆ పంటలను కొనుగోలు చేసేది ఎవరో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో చేతులెత్తేసిందని విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇప్పించలేకపోతున్నారని అన్నారు. ఎరువుల ధరలు 30 శాతం వరకు పెరిగినా, పంటలకు మద్దతు ధరలు ఆ స్థాయిలో పెరగలేదన్నారు. ఎకరానికి రెండు బస్తాల యూరియా అనే నిబంధనను విరమించుకుని, పంటల అవసరాలకు అనుగుణంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మొదట సన్న వడ్లకు, తర్వాత 33 రకాల సన్న వడ్లకు, ఇప్పుడు కేవలం ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ప్రకటించడం ద్వారా బోనస్ పథకానికే మంగళం పాడారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 11 విడతల్లో రూ.74 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారని, కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎకరానికి ఒక సమావేశం పెట్టి, రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారని అన్నారు. రైతు డిక్లరేషన్ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మొత్తం రూ.29,358 కోట్లు బకాయి పడిందన్నారు. గత ఆరు నెలలుగా రైతు బీమా ఎందుకు నిలిచిపోయిందో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంటల కొనుగోలు విషయంలో రాష్ట్ర కేబినెట్ తీసుకున్న తప్పుడు నిర్ణయంపై రైతులకు క్షమాపణ చెప్పాలని, అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, గుండు భూపేష్, కాముని శ్రీనివాస్, జాప శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






