- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యులకు ఊరట.. మే నెలలో 3.93 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
భారతదేశంలో మే 2026 నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.25%, పట్టణ ప్రాంతాల్లో 3.53% గా ధరల పెరుగుదల రేటు ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా గత రెండు నెలలుగా నెలకొన్న పరిస్థితులతో అనేక దేశాల్లో ధరలు భారీగా పెరిగి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. కానీ భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య పౌరులకి భారీ ఊరట లభించింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) శుక్రవారం (జూన్ 12, 2026) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మే నెలలో వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation) 3.93 శాతానికి తగ్గింది. ఏప్రిల్ నెలలో ఇది 3.48 శాతంగా ఉన్నప్పటికీ, గతేడాది ఇదే సమయం తో పోలిస్తే ధరల పెరుగుదల అదుపులో ఉండటం గమనార్హం. ఆర్‌బీఐ (RBI) నిర్దేశించుకున్న 4 శాతం సాధారణ పరిమితి కంటే లోపలనే రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశంగా మారింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా వివరాలు..
కేంద్ర ప్రభుత్వం కొత్త బేస్ ఇయర్ (2024=100) ఆధారంగా విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం వివిధ రంగాల ద్రవ్యోల్బణ గణాంకాలు.. గ్రామాల్లో సాధారణ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 4.25 శాతంగా నమోదైంది. అలాగే నగరాలు, పట్టణాల్లో ద్రవ్యోల్బణం రేటు మరింత తక్కువగా 3.53 శాతంగా రికార్డైంది. మే నెలలో వినియోగదారుల ఆహార ధరల సూచీ (CFPI) ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతంగా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4.85 శాతం, పట్టణ ప్రాంతాల్లో 4.66 శాతంగా ఆహార వస్తువుల ధరల పెరుగుదల రేటు ఉంది.
ఏప్రిల్ నెల ముగింపు గణాంకాలతో (ఆహార ద్రవ్యోల్బణం 4.20%) పోలిస్తే మే నెలలో పండ్లు, కూరగాయల ధరల వల్ల ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరిగినప్పటికీ, ఓవరాల్ రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లోపే ఉండటంతో మార్కెట్ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గణాంకాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను (Repo Rates) తగ్గించే అవకాశాలు మెండుగా ఉన్నాయని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్న వారికి మరో శుభవార్త అందే అవకాశం కనిపిస్తుంది.






