నకిలీ సంతకాలతో రుణాల స్కెచ్..!

by Kodari Anjali |

మహిళా సంఘాల పేరుతో రూ.2 లక్షల రుణాల యత్నం కలకలం రేపుతోంది.

నకిలీ సంతకాలతో రుణాల స్కెచ్..!
X

దిశ, కారేపల్లి: మండల పరిధిలోని గంగారం తండాలో మహిళా సంఘాల పేరుతో రుణాల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. సంఘ సభ్యుల అనుమతి లేకుండానే నకిలీ సంతకాలు, తప్పుడు తీర్మానాల ఆధారంగా రూ.2 లక్షల వరకు రుణాలు పొందేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఐకేపీ వ్యవస్థలో కలకలం రేగింది. ఈ వ్యవహారంలో బుక్‌కీపర్ ప్రసాద్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, విచారణ అనంతరం కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నెల 6న మండల ఐకేపీ సీసీ పద్మ, మరో ఇద్దరు సిబ్బందితో కలిసి గంగారం తండాలో విచారణ నిర్వహించారు. పుష్ప, కస్తూరి డ్వాక్రా సంఘాల సభ్యుల పేర్లతో నకిలీ తీర్మానాలు రూపొందించి, కొందరు సంఘాల లీడర్ల సహకారంతో వి.ఓ.ఏ ప్రసాద్ రుణాలు డ్రా చేసేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అదే రోజు సీసీ మీడియాకు వెల్లడించారు. అయితే సంఘ సభ్యులు మాత్రం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రుణ ప్రక్రియలు నిర్వహించారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా...?

ఉన్నతాధికారులు అసలు సభ్యుల సంతకాలతో మళ్లీ తీర్మానాలు సమర్పించాలని ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఫోర్జరీ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ, విచారణ పూర్తై రోజులు గడుస్తున్నా సంబంధిత సీసీ నుంచి ఉన్నతాధికారులకు నివేదిక అందలేదని సమాచారం. దీంతో విచారణను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై వివరణ కోరినప్పుడు వి.ఓ.ఏ ఫోర్జరీకి పాల్పడ్డారని పేర్కొన్న అధికారులు, మరుసటి రోజు సంఘ నాయకులే ఈ చర్యలకు పాల్పడ్డారని భిన్నమైన సమాచారం ఇవ్వడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. వి.ఓ.ఏను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ స్థానికంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో వి.ఓ.ఏ ప్రసాద్ పాత్రపై పూర్తి స్థాయి విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..

నకిలీ సంతకాలతో మహిళా సంఘాల పేర్లను ఉపయోగించి రుణాల ప్రయత్నాలు జరిగి ఉంటే, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో పాటు మరికొందరి ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఫోర్జరీ ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, పూర్తి నివేదికను బహిర్గతం చేయడంతో పాటు బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. ఈ విషయంపై మండల ఏ.పి.ఎం వెంకటేశ్వర్లు వివరణ కోరగా.. బుక్ కీపర్ ఫోర్జరీ చేశారని దిశ పత్రికలో వచ్చిన కథనం మేరకు సిసి పద్మకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విచారణ చేసిన సీసీ తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. విచారణ ఏం చేశారు వివరాలు స్వీకరించిబుక్ కీపర్ ఫోర్జరీ చేసి ఉంటే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణలో ఆలస్యం వహించిన కిందిస్థాయి అధికారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story