​తరాల బంధం.. ఒకే గొడుకు కిందకు నాలుగు తరాల కుటుంబం

by Kodari Anjali |

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో తరతరాల బంధాన్ని తెగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని ఒక పెద్ద కుటుంబం నిరూపించింది.

​తరాల బంధం.. ఒకే గొడుకు కిందకు నాలుగు తరాల కుటుంబం
X

​దిశ, బూర్గంపాడు: ఒక తరం కష్టపడి సంపాదిస్తే... మరో తరం దాన్ని కాపాడుతుంది. ఒక తరం సంస్కారాన్ని పెంచితే... ఇంకో తరం ఆ కుటుంబ కీర్తిని ముందుకు తీసుకుపోతుంది. ఆధునిక కాలంలో ఉమ్మడి కుటుంబాలు మృగ్యమైపోతున్న వేళ, తరతరాల బంధాన్ని తెగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదేనని నిరూపించింది ఒక పెద్ద కుటుంబం. నాలుగు తరాలు ఒకేచోట కలిసి ముచ్చటించుకుంటే ఆ దృశ్యం ఎంత చూడముచ్చటగా ఉంటుందో, శుక్రవారం నాడు జరిగిన ఒక అద్భుత స్మృతి సమ్మేళనం కళ్లకు కట్టింది. బూర్గంపాడు ​మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన స్వర్గీయ మార్తి తిరుపతయ్య- రామలక్ష్మి దంపతుల వంశవృక్షం... పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద గల ఒక ఫంక్షన్హాల్లో సుమారు 150 మంది సభ్యులతో సగర్వంగా ఆవిష్కృతమైంది.

​జ్ఞాపకాల పందిరిలో... స్మృతి సమ్మేళనం

​మార్తి తిరపతయ్య, రామలక్ష్మి దంపతులు కాలం చేసి 30 ఏళ్లు గడిచిపోయింది. ఆ తర్వాత వారి కుమారులు వెంకటేశ్వర్లు, మార్తి నాగయ్యలు కూడా కాలం చేశారు. అయితే, కుమారుడు వెంకటేశ్వర్లు 16వ వర్ధంతిని పురస్కరించుకుని, కుటుంబ సభ్యులంతా కలిసి ఒక వినూత్న ఆలోచన చేశారు. పెద్దల జ్ఞాపకార్ధం,విడివిడిగా ఉంటున్న కుటుంబాలను ఒకే చోటికి చేర్చాలని సంకల్పించారు. ​మార్తి నాగరాజు, నాగేంద్రప్రసాద్, జాని, కిస్మత్ రావు, గోతం ముతేష్, ఎనుముల వెంకటేష్‌లు ఈ గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన కుమారులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లను సమన్వయం చేస్తూ, అందరినీ ఒకే గొడుకు కిందకు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించారు.

​భావోద్వేగాల మేళవింపు... చిన్ననాటి ముచ్చట్లు

​వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి నాలుగు తరాల ప్రతినిధులు ఒకే వేదికపైకి చేరడంతో ఫంక్షన్హాల్ అంతా బంధుమిత్రుల కోలాహలంతో నూతన శోభను సంతరించుకుంది. పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ, చిన్ననాటి స్మృతులను పంచుకుంటూ ప్రతి ఒక్కరూ ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. దూరాన ఉంటున్న వారు, ఒకరినొకరు పలకరించుకుంటూ ఆనందబాష్పాలు రాల్చారు.​ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ వేడుకలో, కుటుంబ సభ్యులంతా కలిసి సహఫంక్తి భోజనాలు చేశారు. రక్తసంబంధం విలువను, తరాల బంధం గొప్పతనాన్ని చాటిచెప్పిన మార్తి కుటుంబ సభ్యుల ఈ 'స్మృతి సమ్మేళనం' స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంది.

Next Story