మామిడి తోటలో మత్తు ఫ్యాక్టరీ.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ అరెస్ట్

by Naga Rani Yarlagadda |

మామిడితోటలో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్న డ్రగ్ మాఫియా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ రట్టు చేశారు.

మామిడి తోటలో మత్తు ఫ్యాక్టరీ.. మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ అరెస్ట్
X
  • అబ్దుల్లాపూర్‌మెట్‌లో రహస్యంగా మెఫెడ్రోన్ డ్రగ్ తయారీ
  • గుట్టురట్టు చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్
  • రూ.కోటి విలువైన మత్తుమందు, యంత్రాలు, ముడిసరుకు స్వాధీనం
  • గతంలో హత్యలు, దోపిడీలు చేసిన ఘనుడు

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఓ మామిడి తోటలో అత్యంత రహస్యంగా నడుస్తున్న డ్రగ్స్ ఫ్యాక్టరీని తెలంగాణ నార్కోటిక్స్ పోలీస్ విభాగం ఈగల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. దశాబ్దకాలంగా పోలీసుల కళ్లుగప్పుతూ అంతర్జాతీయ ముఠాతో కలిసి డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని, అతడి అనుచరుడిని అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి రూ. 50 లక్షల విలువైన 750 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్‌తో పాటు, ఫ్యాక్టరీలో ఉన్న మరో రూ. 50 లక్షల విలువైన తయారీ యంత్రాలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, ఎల్బీనగర్ క్లూస్ టీమ్‌తో కలిసి ఈగల్ ఫోర్స్ బృందాలు పక్కా సమాచారంతో ఈ మెరుపుదాడి చేశాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరి (38), యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన నిమ్మల నరేష్ (38) కలిసి ఓ ఐ-20 కారులో డ్రగ్స్ తరలిస్తుండగా.. బాటసింగారం రోడ్డులోని శివాజీ మహరాజ్ విగ్రహం సమీపంలో పట్టుకున్నారు.

కెమిస్ట్‌గా మొదలై.. హత్యలు, దోపిడీల వరకు..

ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరి నేర చరిత్ర పోలీసులనే విస్మయానికి గురిచేసింది. 2015కు ముందు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ రసాయన పరిశ్రమలో నెలకు రూ.13,500 జీతానికి కెమిస్ట్‌గా పనిచేసిన ఇతడు.. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో గుజరాత్‌కు చెందిన డ్రగ్స్ తయారీదారులైన విజయ్, సంతోష్ సింగ్ ముఠాతో చేతులు కలిపాడు. అక్కడే మెఫెడ్రోన్ డ్రగ్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. ఈ ముఠా 2016-17 మధ్యకాలంలో హైదరాబాద్, బరోడాల్లో పలు బంగారు దుకాణాల్లో దోపిడీలకు కూడా పాల్పడింది.

తమ గుట్టు పోలీసులకు చెబుతున్నాడనే అనుమానంతో 2019లో చంద్రశేఖర్ అనే వ్యక్తిని 6 గంటల పాటు చిత్రహింసలు పెట్టి అతికిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని కీసరలో పాతిపెట్టారు. ఈ కేసులో జైలుకు వెళ్లొచ్చిన మత్స్యగిరి.. ఆ తర్వాత స్కూల్ కరస్పాండెంట్‌గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారాడు. కరోనా సమయంలో అందులో నష్టాలు రావడంతో మళ్లీ డ్రగ్స్ తయారీ వైపు మళ్లాడు. 2022లో రాంపల్లి, చెంగిచర్లలో డ్రగ్స్ తయారీ ల్యాబ్‌లు పెట్టి, డీఆర్ఐ అధికారులకు పట్టుబడి, పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లి వచ్చాడు.

ఫేషియల్ గ్లో పౌడర్ పేరుతో ముసుగు..

జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మత్స్యగిరి మళ్లీ తన పాత వృత్తికే శ్రీకారం చుట్టాడు. అనుచరుడు నరేష్ సాయంతో అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ మామిడి తోటలో రేకుల షెడ్డును ఎంచుకున్నాడు. అక్కడ వాచ్‌మెన్‌గా ఉన్న వ్యక్తికి నెలకు రూ.10 వేలు ఆశచూపి.. ఫేషియల్ గ్లో పౌడర్ తయారు చేస్తున్నామని నమ్మించాడు. డ్రగ్స్ తయారీకి అవసరమైన ముడిసరుకును ప్రత్యామ్నాయ మార్గాల్లో రప్పించి ఐదు రోజుల పాటు రహస్యంగా ల్యాబ్‌లో మెఫెడ్రోన్ డ్రగ్‌ను తయారు చేశారు. దీన్ని విక్రయించేందుకు తరలిస్తుండగానే పోలీసులకు చిక్కారు. ఈ వ్యవహారంలో ముడిసరుకు అందించిన ప్రభాకర్‌, డ్రగ్ ముఠా సభ్యులు విజయ్, సంతోష్‌ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి..

డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఈగల్ ఫోర్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతపై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. మాదకద్రవ్యాల తయారీ, విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 711110 కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని, తగిన బహుమతి కూడా అందజేస్తామని ఈగల్ ఫోర్స్ అధికారులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Next Story