ప్రభుత్వ రోడ్లపై అక్రమ ర్యాంపుల తొలగింపు

by Ratna Kumari |

నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ రోడ్లపై అక్రమ ర్యాంపుల తొలగింపు
X

దిశ, ఖమ్మం రూరల్ : నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు ఇంటి యజమానులు ప్రభుత్వ రోడ్లపై ఇష్టానుసారంగా ర్యాంపులు నిర్మించడంతో వాహనాల రాకపోకలకు, ప్రజల సంచారానికి తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ రోడ్లను ఆక్రమించి నిర్మించిన అక్రమ ర్యాంపులు, ఇతర నిర్మాణాలను మున్సిపల్ అధికారులు జేసీబీల సహాయంతో తొలగించినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రభుత్వ రోడ్లపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టరాదని, ఇప్పటికే నిర్మించిన ర్యాంపులు, ఆక్రమణలను ప్రజలు స్వచ్ఛందంగా తొలగించి మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలందరూ మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి కోరారు.

Next Story