- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీనాక్షి నటరాజన్ ఆదేశాలు గాలికి.. ఆగని ‘గజమాల’ల సందడి!
కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల జారీ చేసిన గజమాలలు, పాలాభిషేకాలు వంటి ఆర్భాటాలకు దూరంగా ఉండాలన్న ఆదేశాలు అమలులోకి రాకముందే బేఖాతరైనట్లు కనిపిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఇటీవల జారీ చేసిన గజమాలలు, పాలాభిషేకాలు వంటి ఆర్భాటాలకు దూరంగా ఉండాలన్న ఆదేశాలు అమలులోకి రాకముందే బేఖాతరైనట్లు కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె పార్టీ నాయకులకు స్పష్టమైన సూచనలు చేసినప్పటికీ, తాజాగా తాండూరు పట్టణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి భారీ గజమాలతో స్వాగతం పలకడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాండూరులో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డికి స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ గజమాలతో ఘన సత్కారం నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి ఇచ్చిన ఆదేశాలను స్థానిక నాయకులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో మీనాక్షి నటరాజన్ పార్టీ కార్యక్రమాల్లో జేసీబీలతో భారీ గజమాలలు తీసుకువచ్చి నాయకులను సత్కరించడం, పాలాభిషేకాలు వంటి ఆర్భాట కార్యక్రమాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. అలాంటి చర్యలు కొనసాగితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. అయితే, ఆమె హెచ్చరికల అనంతరం జరిగిన ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీ అధిష్టానం ఆదేశాలను స్థానిక నాయకత్వం ఎంతవరకు అమలు చేస్తుందన్న అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.






