భార్యతో గొడవలు.. 18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి

by Naga Rani Yarlagadda |

భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కన్న బిడ్డపట్ల కర్కశంగా ప్రవర్తించాడో దుర్మార్గపు తండ్రి. పసికందు అని కూడా చూడకుండా నేలకేసి కొట్టి.. అతి క్రూరంగా చంపేశాడు.

భార్యతో గొడవలు.. 18 రోజుల పసికందును నేలకేసి కొట్టి చంపిన తండ్రి
X

దిశ, వెబ్‌డెస్క్: భార్యతో తరచూ గొడవలు జరుగుతుండటంతో.. కన్న బిడ్డపట్ల కర్కశంగా ప్రవర్తించాడో దుర్మార్గపు తండ్రి. పసికందు అని కూడా చూడకుండా నేలకేసి కొట్టి.. అతి క్రూరంగా చంపేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జోగిపేట టౌన్ కు చెందిన కృష్ణ, గౌరమ్మలు పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా 18 రోజుల క్రితమే మగబిడ్డ జన్మించాడు. అయితే.. తరచూ భార్య, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

శనివారం ఉదయం కూడా భార్య గౌరమ్మతో గొడవపడిన కృష్ణ.. ఆవేశంలో తల్లిపాలు తాగుతున్న బిడ్డను లాగి.. చెంపలపై కొట్టాడు. దీంతో గౌరికి కోపం మరింత పెరిగి ఇలా చేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. కోపంతో ఊగిపోయిన కృష్ణ.. 18 రోజుల పసికందును గుక్కపెట్టి ఏడుస్తున్నా వదలకుండా నేలకేసి కొట్టాడు. దాంతో గౌరమ్మ గట్టిగా కేకలు వేసింది. తీవ్ర గాయాలతో కొనఊపిరితో ఉన్న బిడ్డను వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుని వెళ్లగా.. వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. దీంతో గౌరమ్మ గుండెలవిసేలా రోదించింది. తన భర్తే బిడ్డను చంపేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీరని విషాదాన్ని నింపింది.

Next Story