డీజీపీ శివధర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట.. నియామకాన్ని సస్పండ్ చేయాలన్న పిటిషన్ డిస్మిస్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 09:33:52  IST  )

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది.

డీజీపీ శివధర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట.. నియామకాన్ని సస్పండ్ చేయాలన్న పిటిషన్ డిస్మిస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో భారీ ఊరట లభించింది. డీజీపీ నియామకాన్ని సస్పెండ్ చేయాలని దాఖలైన మధ్యంతర పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఆ పిటిషన్‌‌ను కొట్టివేస్తున్నట్లుగా వెల్లడించింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఇక పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియను రాబోయే 4 వారాల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ధర్మాసనం యూపీఎస్సీతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంచలన ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ (Prakash Singh Badal) కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా డీజీపీ బి.శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త టి.ధన్‌గోపాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ (Pulla Karthik) గురువారం విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌ రెడ్డి (A Sudarshan Reddy) వాదనలు వినిపిస్తూ ఇదే హైకోర్టు గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు యూపీఎస్సీ (UPSC)కి డిసెంబరు 31న తాజాగా జాబితాను పంపినట్లుగా కోర్టుకు తెలిపారు. ఆలస్యంగా పంపారంటూ జాబితాను యూపీఎస్సీ రిజెక్ట్ చేసిందని గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం 11 ఏళ్ల తరువాత జాబితాను పంపిందని, దీనికి యూపీఎస్సీ ఆమోదించిందని పేర్కొన్నారు. గతంలో యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసిందని, ఎప్పుడూ ఆలస్యమైందనే ప్రస్తావన తీసుకురాలేదని అన్నారు. తాజాగా, జాబితాను పంపుతూ జాప్యం జరిగిందని చెబుతోందన్నారు. యుపీఎస్సీ తరఫు న్యాయవాది కులకర్ణి తన వాదనలు వినిపిస్తూ యూపీఎస్సీకి ఏడేళ్ల తరువాత రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపిందన్నారు. అందువల్ల జాబితాను వెనక్కి పంపినట్లుగా ధర్మాసనానికి తెలిపారు. కేసులో ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి శివధర్ రెడ్డి నియామకంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టవేశారు.

Next Story