ఫ్యూచర్ సంస్థకు నోటీసులు ఇచ్చిన రిలయన్స్ రిటైల్!

by Disha Web Desk 17 |
ఫ్యూచర్ సంస్థకు నోటీసులు ఇచ్చిన రిలయన్స్ రిటైల్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ రిటైల్ పరిశ్రమలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో తాజాగా రిలయన్స్ రిటైల్ సంస్థ గతంలో తీసుకున్న ఫ్యూచర్ గ్రూపునకు చెందిన 950 స్టోర్ల సబ్‌లీజు రద్దుకు సంబంధించి ఫ్యూచర్ రిటైల్‌కు నోటీసులు జారీ చేసింది. ఇందులో 835 ఫ్యూచర్ రిటైల్ స్టోర్లు ఉండగా, 112 ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ స్టోర్ల లీజును రద్దు చేయాలని తమకు నోటీసులు అందజేసినట్లు కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో తెలిపాయి. గత నెలలో ఫ్యూచర్ గ్రూప్ లీజు అద్దె చెల్లించని కారణంగా స్టోర్ స్థలాలను రిలయన్స్ రిటైల్ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇవి నిర్వహణ కోసం ఫ్యూచర్ గ్రూపునకు లీజులో ఉన్నాయి. కంపెనీకి చెందిన 342 బిగ్ బజార్, ఫ్యాషన్ అట్ బిగ్‌బజార్ స్టోర్లు, 493 చిన్న స్టోర్లు, హెరిటేజ్ స్టోర్లకు సంబంధించి నోటీసులు వచ్చాయని ఫ్యూచర్ గ్రూప్ పేర్కొంది. ఈ స్టోర్లు కంపెనీ రిటైల్ రాబడిలో దాదాపు 60 శాతం వరకు సహకారం అందిస్తున్నాయి. 2020లో రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూపును కొనేందుకు రూ. 24, 713 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. అయితే, ఫ్యూచర్ గ్రూప్ అనుబంధ సంస్థకు అమెజాన్‌కు మధ్య వివాదం కారణంగా రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ ఒప్పందం ప్రక్రియ పూర్తి కాలేదు.


Next Story