ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురు కొన్న రిలియన్స్

by Muthe.Rajitha |   (  Updated:2026-03-25 09:24:38  IST  )

అమెరికా క్రూడ్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తివేయడంతో ఇరాన్ నుంచి ఏడేళ్ల తర్వాత తొలిసారిగా రిలియన్స్ భారీగా చమురు కొనుగోలు చేసింది.

ఇరాన్ నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురు కొన్న రిలియన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇరాన్ నుండి సుమారు 50 లక్షల బ్యారెళ్ల (5 Million Barrels) ముడి చమురును కొనుగోలు చేసింది. 2019లో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుండి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసింది. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని నివారించడానికి, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను అదుపు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను 30 రోజులపాటు తాత్కాలికంగా సడలించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రిలయన్స్, నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ(NIOC)తో ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ఆర్థికంగానూ, సాంకేతికంగానూ రిలయన్స్‌కు ఎంతో లాభదాయకం. ఇరాన్ ముడి చమురు నాణ్యత జామ్‌నగర్ రిఫైనరీలోని అత్యాధునిక యంత్రాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 నుండి 120 డాలర్ల మధ్య ఉండగా, రిలయన్స్ సుమారు 7 డాలర్ల ప్రీమియంతో ఈ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా చమురుపై భారత్ ఏ విధంగా ఆధారపడిందో, ఇప్పుడు ఇరాన్ చమురు దిగుమతుల పునఃప్రారంభం ద్వారా భారత్ తన ఇంధన వనరులను వివిధ దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఇది కేవలం రిలయన్స్‌కే కాకుండా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల స్థిరీకరణకు కూడా పరోక్షంగా దోహదపడే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంపై రిలయన్స్ యాజమాన్యం ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, రాయిటర్స్, ఎకనామిక్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు దీనిని ధృవీకరించాయి. అమెరికా ఇచ్చిన ఈ 30 రోజుల గడువులోగా మరిన్ని భారతీయ చమురు సంస్థలు (IOCL, BPCL) కూడా ఇరాన్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది.

రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురు

Next Story