స్తంభించిన రిజిస్ట్రేషన్లు

by Ratna Kumari |

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపాలు మరోసారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

స్తంభించిన రిజిస్ట్రేషన్లు
X

దిశ, గంగాధర : సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక లోపాలు మరోసారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రధాన సర్వర్లు పూర్తిగా మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఇతర ఆస్తుల బదలాయింపు ప్రక్రియ (రిజిస్ట్రేషన్లు) గత రెండు రోజులుగా పూర్తిగా స్తంభించిపోయింది. ఇటీవల జూన్ 26 నుంచి 28 వరకు సర్వర్ల ఆధునీకరణ (మెయింటెనెన్స్) పేరిట సేవలను నిలిపివేసిన అధికారులు, అనంతరం కూడా సాంకేతిక లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత మూడు నెలల కాలంలోనే సర్వర్లు డౌన్ కావడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. సర్వర్ సమస్యల కారణంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డిజిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా స్లాట్ బుకింగ్‌లు, చలాన్ల చెల్లింపులు, ఈ-కేవైసీ (ఈ-నో యువర్ కస్టమర్) ప్రక్రియలు నిలిచిపోయాయి. లబ్ధిదారుల బయోమెట్రిక్ ధృవీకరణలు పూర్తికాకపోవడంతో రిజిస్ట్రేషన్లు తుది దశలో నిలిచిపోతున్నాయి. దూర ప్రాంతాల నుంచి, ప్రత్యేకంగా సెలవులు పెట్టుకుని వచ్చిన క్రయ, విక్రయదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గంటల తరబడి వేచి చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. పదేపదే సర్వర్లు నిలిచిపోతుండటంతో ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకుని, లక్షలాది రూపాయల చలాన్లు చెల్లించినప్పటికీ సేవలు అందకపోవడంపై మండిపడుతున్నారు. సాంకేతిక సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం, ఐటీ విభాగాలు విఫలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం రంగంలోకి దిగి సర్వర్లను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసింది. సాంకేతిక లోపాన్ని వీలైనంత త్వరగా అధిగమించి సేవలను యథావిధిగా అందుబాటులోకి తీసుకువస్తామని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు వెల్లడించారు. అయితే సర్వర్లు ఎప్పటికి పూర్తిస్థాయిలో పనిచేస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.

Next Story