ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్యుమెంట్ రైటర్లదే హవా

by Malleboina Mahesh |

ఉమ్మడి వరంగల్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్ విధానం ఉన్నా డాక్యుమెంట్ రైటర్ల వసూళ్ల పర్వం ఆగడం లేదు. ఏసీబీ తనిఖీలు చేసినా వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు బాహాటంగానే సాగుతున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డాక్యుమెంట్ రైటర్లదే హవా
X

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లాలో హన్మకొండ, వరంగల్, వరంగల్ ఖిల్లా, వర్ధన్నపేట, జనగామ, కొడకండ్ల, స్టేషన్ ఘన్​పూర్, భీమదేవరపల్లి, పరకాల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో వ్యవసాయేతర, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్లాట్లు, అపార్ట్ మెంట్లు, ఇళ్లు, ఖాళీ జాగాలు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు గడిచిన కొన్నేళ్లుగా ఆన్ లైన్ లోనే కొనసాగుతున్నాయి. ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కు తేదీలను మంజూరు చేస్తారు. ఆన్ లైన్ లోనే అన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర ఫీజులన్నీ చెల్లిస్తారు. ఆ ఫీజుల ఆధారంగా డాక్యుమెంట్లను స్లాట్ లో బుక్ చేసుకున్న తేదీలోకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తే రిజిస్ట్రేషన్లు చేస్తారు. మధ్యవర్తిత్వానికి సంబంధం లేకుండా అన్ని డాక్యుమెంట్లు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలి. కొన్నేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ విధానం తెచ్చిన తర్వాత డాక్యుమెంట్ రైటర్ల విధానాన్ని ఎత్తివేసింది.

నేరుగా కొన్నవారు అమ్మినవారు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. కానీ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నేరుగా వచ్చినవారికి పనులు జరగడం లేదు. ఏదో ఒక వంకతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ను వాయిదా వేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వచ్చే వారికి మాత్రం వెంటవెంటనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వెళ్లిన వారికి నిమిషాల్లో పని జరుగుతుండగా మిగతా వారికి మాత్రం జరగడం లేదు. రోజుల తరబడి తిరిగితే తప్పా పని కావడం లేదు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసిన తర్వాత ఆ వివరాలను పరిశీలిస్తున్న రైటర్లు వారితో చర్చలు జరుపుతూ భయాలు చెబుతూ తమ ద్వారా వెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారికి వివరిస్తున్నారు. డాక్యుమెంట్ ను బట్టి రేట్ ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.

ప్రతి కార్యాలయంలో పదుల సంఖ్యలో రైటర్లు..

ప్రతి కార్యాలయం పరిధిలో పదుల సంఖ్యలో డాక్యుమెంట్ రైటర్లు పనులు చేస్తున్నారు. ఏ కార్యాలయానికి వెళ్లిన వారి హడావిడే ఎక్కువగా ఉంటుంది. బాహాటంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా పట్టింపు లేదు. కనీసం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. వేల రూపాయలు వసూలు చేస్తూ అధికారులకు అందిస్తున్నారు. హన్మకొండ, భూపాలపల్లి, ఖిల్లా, నర్సంపేటతో పాటు పలు కార్యాలయాల పరిధిలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తనిఖీలు చేసినా మార్పు రాలేదు. ఇప్పటికీ ప్రతిరోజూ కొనసాగుతూనే ఉంది. కొన్ని కార్యాలయాల్లో వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. దేవాలయ, వక్ఫ్ బోర్డు, ఇరిగేషన్, రెవెన్యూ తో పాటు ఇతర శాఖలకు సంబంధించిన భూములు కూడా పట్టాభూములుగా చూపి రిజిస్ట్రేషన్లు చేశారు. వీటిపై కేసులు నమోదైనా మార్పులు మాత్రం రాలేదు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగితం ఉంటేనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. కొంత మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇతరులకు ఇన్చార్జిలుగా ఇచ్చిన చోట ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిపైన ఉన్నతాధికారులు దృష్టి పెడితే కొంత తగ్గే అవకాశం ఉంది.

Next Story