- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ రీ-సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తాం : కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

దిశ,సత్తుపల్లి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ రీ-సర్వే కార్యక్రమాన్ని ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. గురువారం సత్తుపల్లి తహసీల్దార్ కార్యాలయం:లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ తో కలిసి మండల సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా బేతుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ-సర్వే వివరాలను కంప్యూటర్ లో చేసే డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో భూ సర్వే ప్రక్రియ, సేకరించిన సమాచారాన్ని డిజిటల్ రికార్డుల్లో నమోదు చేస్తున్న తీరును క్షుణ్ణంగా ఎమ్మెల్యే కు కలెక్టర్ వివరించారు. రోజుకు 10 బృందాలతో సుమారు 300 ఎకరాల భూ రీ సర్వే చేస్తున్నామని, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ మాట్లాడుతూ, రీ-సర్వేలో ప్రతి దశను నిబంధనలకు లోబడి, పూర్తి ఆధారాలతో నమోదు చేస్తున్నామని, సర్వే సమయంలో సేకరించిన ప్రతి వివరాన్ని భూ యజమానులు, రైతుల సమక్షంలో ధ్రువీకరించి, పంచనామ చేసిన సమాచారం, భూ హద్దులు, సర్వే నంబర్లు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలు తదితర అంశాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేతో భూముల హద్దులు శాస్త్రీయంగా నిర్ధారించబడి, భూ రికార్డులు నవీకరించబడతాయని అన్నారు. రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు, పారదర్శక భూ రికార్డులు అందుబాటులోకి రావడంతో పాటు వంద శాతం భూ వివాదాల పరిష్కారానికి ఇది దోహదపడుతుందని అన్నారు.
ప్రతి భూ రీ-సర్వే సమయంలో సంబంధిత రైతు వద్ద ఉన్న పట్టాదారు పాస్‌బుక్, పాత పహాణీ లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలు వంటి అన్ని పత్రాలు సర్వే నోటీసు అందించినట్లు రసీదు తీసుకోవడం, ఫోటోలతో కూడిన పంచనామా తయారు చేయడం, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ నమోదు చేయడం వంటి ప్రక్రియలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. భూ సర్వే పూర్తయిన వెంటనే రైతు సమక్షంలోనే కొలతల వివరాలను వివరిస్తూ అవసరమైతే రైతు అభ్యర్థన మేరకు మరోసారి కొలతలు తీసి సందేహాలను నివృత్తి చేస్తున్నామని, రైతుకు వచ్చిన విస్తీర్ణాన్ని స్పష్టంగా తెలియజేసి, అతని అంగీకారంతో సంతకం తీసుకుంటున్నామని అన్నారు. ఇలా పారదర్శకంగా వ్యవహరిస్తూన్నాం కాబట్టి రీ-సర్వేపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి తహసీల్దార్ సత్యనారాయణ, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






