- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్విగ్గీకి సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు
ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై స్విగ్గీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎఫ్ఎస్ఎస్ఏఐ, ట్రేడ్ లైసెన్సులు ఉన్నా సంస్థలతోనే కార్యకలాపాలు నిర్వహించాలని స్విగ్గీ ప్రతినిధులకు సీఎంసీ కమిషనర్ సృజన స్పష్టం చేశారు. ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేయాలనే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆహార భద్రతా ప్రమాణాల అమలును మరింత బలోపేతం చేసే దిశగా స్విగ్గీ ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించింది. కార్పొరేషన్ జారీ చేసిన నోటీసులకు స్పందనగా హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సేవలు అందిస్తున్న ఆహార వ్యాపార సంస్థలు చట్టబద్ధ నిబంధనలను కచ్చితంగా పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. అలాగే కార్పొరేషన్, స్విగ్గీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం, వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
స్విగ్గీ తన ప్లాట్‌ఫారమ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆహార వ్యాపార సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్స్‌ను తప్పనిసరి చేయడానికి అంగీకరించింది. అలాగే కార్పొరేషన్‌తో సమన్వయం కోసం ప్రత్యేక ‘నోడల్ అధికారిని’ నియమించేందుకు కూడా అంగీకారం తెలిపింది. అదనంగా, ఆన్‌బోర్డింగ్ ఏజెన్సీలు, ఆహార వ్యాపార సంస్థల కోసం ‘ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ఓపీఎస్)’ రూపొందించి అమలు చేయడంతో పాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు పొందేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించేందుకు స్విగ్గీ అంగీకరించింది. అలాగే ప్లాట్‌ఫారమ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లౌడ్ కిచెన్లు, ఆహార విక్రయ కేంద్రాలు అన్ని చట్టబద్ధ నిబంధనలు పాటిస్తున్నాయో లేదో కఠినంగా ధృవీకరించనున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా కమిషనరన్ సృజన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రతను నిర్ధారించడం కార్పొరేషన్ అత్యున్నత ప్రాధాన్యతలలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) ఒకటని పునరుద్ఘాటించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలు, పరిశుభ్రమైన ఆహార పద్ధతుల ప్రోత్సాహం, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు, ఆహార వ్యాపార సంస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెల్త్ అండ్ శానిటేషన్ అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, స్విగ్గీ ప్రతినిధులు పాల్గొన్నారు.






