పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు

by Malleboina Mahesh |

గురుగ్రామ్‌లో పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే బీఎన్ఎస్ (BNS) కింద క్రిమినల్ కేసులు!

పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: పెంపుడు కుక్కల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరి చేస్తూ హర్యానాలోని సైబర్ సిటీ గురుగ్రామ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సీటీలో గత కొద్ది రోజులుగా పెంపుడు కుక్కల దాడులు, కుక్క కాటు కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్న నేపథ్యంలో గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ (Gurugram Municipal Corporation) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలోని పెంపుడు కుక్కలన్నింటి (Pet dogs)కీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ మున్సిపల్ అధికారులు తాజా ఉత్తర్వులు జారీ చేశారు. నూతన నిబంధనల ప్రకారం.. యజమానులు మున్సిపల్ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమతో పాటు పెంపుడు కుక్క ఉన్న జంట ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

దీనితో పాటు సదరు కుక్కకు సంబంధించిన యాంటీ-రేబిస్ వ్యాక్సినేషన్ (Anti-Rabies) సర్టిఫికెట్ సమర్పించడం మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా తప్పనిసరి చేసింది. ఒకవేళ రిజిస్ట్రేషన్ లేకుండా కుక్కలను పెంచుకున్నా, లేదా వాటి వల్ల ఎవరికైనా హాని జరిగినా.. యజమానులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం.. పబ్లిక్ ప్లేసెస్‌లో పెంపుడు జంతువుల ప్రవర్తనపై యజమానులదే పూర్తి బాధ్యత అని మున్సిపల్ కార్పొరేషన్ తేల్చి చెప్పింది.

కుక్కలను రోడ్లు, పార్కులు, గ్రీన్ బెల్ట్‌లలోకి తెచ్చేటప్పుడు ఖచ్చితంగా గొలుసు (Leash) కట్టాలని, ఒకవేళ అవి బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన చేస్తే పరిసరాల పరిశుభ్రతను కాపాడాల్సిన బాధ్యత యజమానులదేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా పిట్‌బుల్, రాట్‌వైలర్, డోగో అర్జెంటీనో వంటి అత్యంత ప్రమాదకరమైన, దూకుడు స్వభావం గల జాతుల (Aggressive Breeds) విషయంలో నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈ జాతి కుక్కలను బయటకు తెచ్చేటప్పుడు గొలుసుతో పాటు వాటి నోటికి తప్పనిసరిగా మజిల్ (Muzzle-నోటి కవచం) తగిలించాలని, నిబంధనలు ఉల్లంఘించే సొసైటీలు మరియు ఫ్లాట్ల యజమానులపై భారీ జరిమానాలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు.

Next Story