సంక్రాంతి సంబరాల్లో రికార్డింగ్ డ్యాన్సులు – సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు

by Muthe.Rajitha |

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగను సంప్రదాయాలు, కుటుంబ విలువలు, తెలుగు సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా భావిస్తారు.

సంక్రాంతి సంబరాల్లో రికార్డింగ్ డ్యాన్సులు – సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగను సంప్రదాయాలు, కుటుంబ విలువలు, తెలుగు సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా భావిస్తారు. ముగ్గులు, గొబ్బెమ్మలు, కొత్త బట్టలు, పూజలు, కోడిపందేలు వంటి కార్యక్రమాలతో పండుగను జరుపుకుంటారు. అయితే ఇటీవల సంక్రాంతి సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పండుగ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమాలు మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రికార్డింగ్ డ్యాన్సుల సమయంలో మహిళా డ్యాన్సర్లతో కొందరు యువకులు, స్థానిక నాయకులు అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్యాన్స్ చేస్తున్న మహిళలను అవమానకరంగా మాట్లాడటం, బట్టలు విప్పమని వేధించడం, కొందరు స్టేజ్‌పైకి వెళ్లి హద్దులు దాటడం వంటి తీవ్ర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో "ఇదేనా మన పండుగ సంస్కృతి?" అంటూ నెటిజన్లు, సామజిక కార్యకర్తలు మండిపడుతున్నారు.

పగలు మహిళలు ఎలా దుస్తులు ధరించాలి, ఎలా ఉండాలి అని సూచనలు ఇచ్చే పురుషాధిక్య సమాజం.. రాత్రి జరిగే ఈ అసభ్య ప్రదర్శనలపై మాత్రం మౌనం వహించడం ద్వంద్వ వైఖరిగా విమర్శలు ఎదుర్కొంటోంది. మహిళల వస్త్ర ధారణపై వ్యాఖ్యలు చేసే వారు, ఈ రికార్డింగ్ డ్యాన్సుల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ రికార్డింగ్ డ్యాన్సుల్లో పాల్గొనే మహిళల్లో ఎక్కువ మంది పేద కుటుంబాలకు, వెనుకబడిన వర్గాలకు చెందినవారే అన్న ఆరోపణలు ఉన్నాయి. జీవనోపాధి కోసం వారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. అయితే ఆకలి పేరుతో మహిళల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం సమాజానికి సరికాదని మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల పేరుతో మహిళలను అంగట్లో బొమ్మలుగా చూడటాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. తక్షణమే ఈ విష సంస్కృతిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

చట్టపరంగా చూస్తే, బహిరంగ ప్రదేశాల్లో అసభ్య ప్రదర్శనలు నేరం. అయినా పండుగల పేరుతో రాత్రి వేళల్లో మైకులు మోగుతూ, మహిళలతో అసభ్య డ్యాన్సుల ప్రదర్శనలు కొనసాగుతుండటం పట్ల పోలీసు, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందంటూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా రావడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు ఈ రికార్డింగ్ డ్యాన్సులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పండుగలు ఆనందానికి, సంస్కృతి పరిరక్షణకు ఉండాలి తప్ప, మహిళలను అవమానించడానికి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, మహిళలను గౌరవించే నిజమైన సంక్రాంతి సంబరాలు జరగాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story