కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం రికార్డు స్థాయిలో 16 ప్రత్యేక రైళ్లు

by Malleboina Mahesh |

బీహార్ కానిస్టేబుల్ పరీక్షల వేళ అభ్యర్థుల ఇబ్బందులను తొలగించేందుకు ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ (ECR) రంగంలోకి దిగి విద్యార్థుల కోసం ఏకంగా 16 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం రికార్డు స్థాయిలో 16 ప్రత్యేక రైళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: బీహార్ కానిస్టేబుల్ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారి రైళ్లపై రాళ్ల దాడికి దారి తీసింది. దీంతో శనివారం రాత్రి పలు రైల్వే స్టేషన్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. బీహార్ ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామక పరీక్షల (Constable Recruitment Exams) వేళ పాట్లీపుత్ర రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి.. పరీక్ష ముగించుకుని తిరిగి వెళ్లేందుకు భారీ సంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. వారిలో అత్యధికులు సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

ఈ క్రమంలోనే కొందరు అసాంఘిక శక్తులు స్టేషన్ పరిసరాల్లో, రైళ్లపై పెద్ద ఎత్తున రాళ్ల దాడికి పాల్పడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని గమనించిన ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ (ECR) అధికారులు అభ్యర్థుల ప్రయాణ సౌకర్యార్థం తక్షణమే రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున పాట్లీపుత్ర నుండి కటిహార్‌కు, అలాగే పాట్నా నుండి భబువాకు ప్రత్యేక రైళ్లను నడిపారు.

ఆదివారం మధ్యాహ్నం జరగబోయే రెండో షిఫ్ట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం, అలాగే పరీక్ష ముగించుకుని ఇళ్లకు తిరిగి వెళ్లే వారి కోసం రైల్వే శాఖ (Railway Department) రికార్డు స్థాయిలో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దానాపూర్ డివిజన్ నుండి 10 ప్రత్యేక రైళ్లు, సమస్తీపూర్ డివిజన్ నుండి 6 ప్రత్యేక రైళ్లతో కలిపి మొత్తం 16 స్పెషల్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు స్పష్టం చేశారు. స్టేషన్‌లో గొడవలు సృష్టించి, రాళ్లదాడికి పాల్పడిన వారిని సీసీటీవీ కెమెరాలు, వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నామని, ప్రయాణికులు మరియు విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మకుండా రైల్వే ప్రత్యేక రైళ్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Next Story