ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: ప్రమాదం కాదు.. పక్కా స్కెచ్!

by Kema Shiva Kumar |

ఢిల్లీ తుగ్లకాబాద్ ఘోర అగ్నిప్రమాదం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు.

ఢిల్లీ అగ్నిప్రమాదంలో షాకింగ్ ట్విస్ట్: ప్రమాదం కాదు.. పక్కా స్కెచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని తుగ్లకాబాద్ (Tughlaqabad) ఎక్స్‌టెన్షన్‌ పరిధిలో జూన్ 12న జరిగిన ఘోర అగ్నిప్రమాద కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా అంతా భావించారు. వాస్తవానికి అది పక్కా స్కేచ్‌తో చేసిన కుట్ర (Planned Arson) అని ఢీల్లీ పోలీసులు నిర్ధారించారు. వ్యక్తిగత, ఆర్థిక కక్షల నేపథ్యంలో ఓ మైనర్ బాలికను రెచ్చగొట్టి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

సీసీటీవీ ఫుటేజీతో అడ్డంగా బుక్కై..

అయితే, జూన్ 12 తెల్లవారుజామున 2:24 గంటల సమయంలో ఓ నివాస భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పంకజ్, సుశీలా దేవి, సోనియా కుమారి అనే ముగ్గురు వ్యక్తులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై అనుమానంతో పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించారు. మంటలు అంటుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ఓ మహిళ భవనంలోకి వెళ్లడం, ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి వేగంగా బయటకు వచ్చేయడం కెమెరాల్లో రికార్డ్ అయింది. దీని ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు కుట్ర బయటపడింది.

టార్గెట్ బైక్.. అన్యాయంగా ముగ్గురు బలి

గోవింద్‌పురి (Govindpuri) ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకుంది. బిల్డింగ్ 5వ అంతస్తులో ఉండే దీపక్ (Deepak) అనే వ్యక్తిపై కక్షతో భవనం కింద పార్క్ చేసి ఉన్న అతని మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టడమే తమ ప్లాన్ అని ఆమె తెలిపింది. గిరినగర్‌కు చెందిన సరిత (27) అనే మహిళ తనకు పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె ఇచ్చి బైక్‌కు నిప్పు పెట్టమని పంపినట్లుగా బాలిక కోర్టుకు తెలిపింది. సరిత వెనుక అసలు మాస్టర్ మైండ్స్ నిరంజన్ (33), అతని తమ్ముడు రాజ్‌కుమార్ (27) అని పోలీసులు తేల్చారు. నిరంజన్‌కు దీపక్‌తో పాత ఆర్థిక, వ్యక్తిగత గొడవలు ఉంగా.. నిరంజన్ గతంలో నేర చరిత్ర ఉన్న వ్యక్తి కావడం, జైలు నుంచి ఇటీవలే విడుదల అయ్యాడు. టార్గెట్ కేవలం బైక్ మాత్రమే అయినప్పటికీ, ఆ మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించడంతో.. సంబంధం లేని ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మైనర్ బాలికను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story