- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవీంద్రభారతి బుకింగ్ ఇక ఆన్‌లైన్.. వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
రవీంద్రభారతి హాల్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం డిజిటలైజ్ చేసింది. మంత్రి జూపల్లి ఆవిష్కరించిన కొత్త వెబ్‌సైట్ ద్వారా మూడు రకాల థియేటర్లను, మూడు స్లాట్లలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు

దిశ, తెలంగాణ బ్యూరో: కళాకారులు, సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు రవీంద్రభారతి (Ravindra Bharati) స్లాట్ల కోసం ఇకపై కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పారదర్శకతను పెంచుతూ, ఇంటి నుండే స్లాట్లను బుక్ చేసుకునేలా రూపొందించిన నూతన వెబ్‌సైట్‌ను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతికత ద్వారా బుకింగ్ ప్రక్రియను మరింత సరళతరం చేశామని తెలిపారు. నిర్వాహకులు వెబ్‌సైట్‌లో తేదీల లభ్యతను స్వయంగా చూసుకుని, నగదు చెల్లించి స్లాట్ రిజర్వ్ చేసుకోవచ్చని వివరించారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా మెయిన్ హాల్ (1036 సీట్లు), మినీ హాల్ (120 సీట్లు) మరియు లఘు చిత్రాల ప్రదర్శన కోసం కేటాయించిన పైడి జయరాజ్ థియేటర్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని మూడు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, 90 రోజుల ముందే బుకింగ్ చేసుకునే వీలుందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ కోరుకున్న తేదీ ఖాళీ లేకపోతే వెయిటింగ్ లిస్ట్ సౌకర్యం కూడా కల్పించారు. కేవలం నిర్వాహకులకే కాకుండా, ప్రతిరోజూ అక్కడ జరిగే కార్యక్రమాల వివరాలను కళాభిమానులు తెలుసుకునేలా వెబ్‌సైట్‌లో సమాచారాన్ని పొందుపరిచారు.






