బలగాని హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స

by Jakkula.Mamatha |

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.

బలగాని హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స
X

దిశ,మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బలగాని స్పైన్ అండ్ ఆర్థో హాస్పిటల్‌లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. న్యూరో మస్కులర్ స్కోలియోసిస్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి చికిత్స చేసి, అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. డాక్టర్ శ్రీనివాస్ బలగాని, అనస్థీషియా నిపుణురాలి సహకారంతో సుమారు 3 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన సాత్విక్(12) పుట్టుకతోనే వెన్నెముక వంకరగా ఉండేది. బాలుడు పెరిగే కొద్దీ వెన్నెముక మరింత వంకర తిరగడంతో నడవడం, కూర్చోవడం కూడా కష్టంగా మారింది. ఇటీవల పరిస్థితి మరింత విషమించడంతో తల్లిదండ్రులు అతడిని డాక్టర్ శ్రీనివాస్ బలగాని వద్దకు తీసుకువచ్చారు.

బాలుడి పరిస్థితిని సమీక్షించి, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అతను న్యూరో మస్కులర్ స్కోలియోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. అనంతరం ఐదు రోజుల క్రితం శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స సమయంలో రోగిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించారు. అనస్థీషియా నిపుణురాలు ఎనిమిది గంటల పాటు రోగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ డాక్టర్ శ్రీనివాస్‌కు పూర్తి సహాయ సహకారాలు అందించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన ఐదు రోజుల తర్వాత సాత్విక్ కోలుకోవడం ప్రారంభించాడు.

గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయాయి. వంగి నడిచే పరిస్థితి మారి, ప్రస్తుతం నిటారుగా నిలబడటమే కాకుండా సౌకర్యంగా కూర్చోగలుగుతున్నాడు. పూర్తి స్థాయిలో కోలుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సందర్భంగా సాత్విక్ తండ్రి మాట్లాడుతూ.. డాక్టర్ శ్రీనివాస్ బలగాని తమ కుమారుడిని కోలుకునేలా చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. పుట్టినప్పటి నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడి పరిస్థితి చూసి ఎన్నోసార్లు మనసు కలచివేసిందని, శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్యం మెరుగుపడటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమ కుమారుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్ శ్రీనివాస్ బలగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story