​ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. ఐదు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు

by Jakkula.Mamatha |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించబడ్డాయి.

​ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. ఐదు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు
X

​దిశ, హుజూరాబాద్ రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించబడ్డాయి. మండలంలోని జూపాక, కందుగుల, కనుకుల గిద్దె, కాట్రపల్లి, మందాడి పల్లి గ్రామాల్లో ఈ సభలు జరిగాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ ప్రత్యేక సభలను ఏర్పాటు చేశారు.

​కనుకుల గిద్దె గ్రామసభకు విశేష స్పందన..

​మండలంలోని కనుకుల గిద్దె గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం 99 రోజుల ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని ఆదేశించారు. ​ఈ సభలో స్థానిక ఎంపీడీవో తూర్పాటి సునీత, ఏపిఎం, ఈజీఎస్ ఏపీఓతో పాటు గ్రామస్థాయి అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తమ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

​పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సమీక్ష..

​గ్రామసభల అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గీత మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ​ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్యం, హరితహారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిత గడువులోగా వంద శాతం విజయవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి మండల కీర్తిని పెంపొందించాలని ఆమె పిలుపునిచ్చారు.

Next Story