రేవంత్ ప్రభుత్వంలో లక్ష కోట్ల భూదోపిడీ.. ఆధారాలతో సహా బయటపెడతా : కవిత

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూదోపిడీకి తెరలేపిందని, పేదలకు అన్యాయం చేస్తూ బడా బాబులకు భూములను కట్టబెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

రేవంత్ ప్రభుత్వంలో లక్ష కోట్ల భూదోపిడీ.. ఆధారాలతో సహా బయటపెడతా : కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూదోపిడీకి తెరలేపిందని, పేదలకు అన్యాయం చేస్తూ బడా బాబులకు భూములను కట్టబెడుతోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో కవిత శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సోదరులు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు బందిపోట్ల మాదిరిగా తెలంగాణ వనరులను దోచుకుంటున్నారని విమర్శించారు. మూసీ నది గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా ‘శ్రీ ఆదిత్య బిల్డర్స్’ చేస్తున్న కబ్జాలు, ప్రేమవతి పేట పెద్ద చెరువు భూమి ఆక్రమణ వంటి అంశాలపై ఆధారాలతో సహా వరుసగా బయటపెడతామని పేర్కొన్నారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూల్చడానికేనా, బడా బాబుల అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ముందా అని కవిత ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమి కోడికుంట చెరువు శిఖం అని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ భూమిని వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ హయాంలో భూదోపిడీకి కిటికీలు తెరిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా తలుపులే బార్లా తెరిచి దోపిడీ చేస్తోందని కవిత ఎద్దేవా చేశారు. నాడు, నేడు రాష్ట్రంలో నడుస్తోంది 'కేటీఆర్' పాలనేనన్నారు. గతంలో కేటీఆర్ అంటే కేసీఆర్, తన్నీరు హరీష్ రావు, కల్వకుంట్ల రామారావు కాగా.. ఇప్పుడు కేటీఆర్ పాలన అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఇది కాంగ్రెస్‌కు చివరి ప్రభుత్వమని, రేవంత్ రెడ్డి తీరుతో ఆ పార్టీ 20 ఏళ్ల పాటు కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదని, ఆంధ్రాకు మేలు చేసేలా నీటి ఒప్పందాలు చేసుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులకు భూములు కేటాయించాలని డిమాండ్ చేస్తూ, వచ్చే నెలలో ఉప్పల్ భగాయత్‌లో పెద్ద ఎత్తున భూపోరాటం చేయనున్నట్లు కవిత ప్రకటించారు.

Next Story