పీవీ విజ్ఞాన కేంద్రంలో కలెక్టర్ తనిఖీ.. త్వరలో ‘పీవీ స్మృతి వనం’ ప్రారంభం

by Ratna Kumari |

మండలంలోని పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించి అభివృద్ధి పనులు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.

పీవీ విజ్ఞాన కేంద్రంలో కలెక్టర్ తనిఖీ.. త్వరలో ‘పీవీ స్మృతి వనం’ ప్రారంభం
X

దిశ, భీమదేవరపల్లి : జిల్లా కలెక్టర్ గురువారం మండలంలోని పలు ప్రభుత్వ సంస్థలను సందర్శించి అభివృద్ధి పనులు, విద్యార్థుల సంక్షేమం, మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు. తొలుత వంగరలోని పీవీ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ కొనసాగుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరును పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేంద్రాన్ని మరింత ప్రజోపయోగకరంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు స్మృతిని చిరస్థాయిగా నిలబెట్టే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న "పీవీ స్మృతి వనం"ను త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్మృతి వనాన్ని సందర్శకులను ఆకట్టుకునేలా పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతులతో అభివృద్ధి చేయాలని సూచించారు.

అనంతరం ముల్కనూరు సమ్మక్క–సారలమ్మ వంగర క్రాస్ సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ) హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి చదువులు, వసతి, భోజన సౌకర్యాలు, అందిస్తున్న ఫుడ్ మెనూ అమలుపై ఆరా తీశారు. నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పరిశుభ్రత, పోషకాహార ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజేష్, ఎంపీడీవో వీరేశం, ఎస్సై దివ్య, రాజులు పాల్గొన్నారు.

Next Story