అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు

by Kema Shiva Kumar |

భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్, తెలుగు తేజం దీపికకు అరుదైన గౌరవం దక్కింది.

అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్, తెలుగు తేజం దీపిక (Deepika)కు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఆమెను ఆహ్వానించారు. శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండల పరిధిలోని తంబాలహట్టి (Thambalahatti) గ్రామానికి చెందిన దీపిక, అంధత్వాన్ని జయించి క్రికెట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల జరిగిన మహిళా అంధుల టీ-20 ప్రపంచకప్‌ (Women's Blind T20 World Cup)లో భారత జట్టును అద్భుతంగా నడిపించి, భారత్‌ను విజేతగా నిలబెట్టడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ మేరకు ప్రెసిడెంట్ ఆఫీసు నుంచి పంపిన అధికారిక ఆహ్వాన పత్రికను తపాల శాఖ అధికారులు స్వయంగా దీపిక స్వగ్రామానికి వెళ్లి ఆమెకు అందజేశారు. క్రీడల్లో ఆమె కనబరిచిన అంకితభావం, పట్టుదలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కిందని పలువురు ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.. దేశ ప్రథమ పౌరురాలి నుంచి పిలుపు రావడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను స్వయంగా వీక్షించే అవకాశం లభించడం లక్కీగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ అరుదైన గౌరవం నాపై మరింత బాధ్యతను పెంచిందని దీపిక కామెంట్ చేశారు.

Next Story