ఇసుక రీచ్‌లలో ఇష్టారాజ్యం..!

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి.

ఇసుక రీచ్‌లలో ఇష్టారాజ్యం..!
X

దిశ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు మండి పడుతున్నాయి. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లను లారీల పార్కింగ్‌కు వాడుతున్న రీచ్ నిర్వాహకులు చెరువు కట్టను ధ్వంసం చేసి రహదారిగా మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. శిఖం భూమిని ఆక్రమించిన రీచ్ నిర్వాహకులు ఇసుక డంపులు ఏర్పాటు చేసి తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారిని డబ్బు, రాజకీయ అండతో నోరు మూయిస్తు ప్రజా జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తు ఇసుక దందా సాగించడం వివాదస్పదంగా మారుతుండడంతో ఇసుక రీచ్ నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్టవేయాలనే డిమాండ్ లు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

గ్రామీణ వ్యవసాయానికి మూలాధారమైన చెరువులను రీచ్ నిర్వాహకులు నిర్వీర్యం చేస్తున్నారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి క్వారీ నిర్వాహకులు మానేరులో ఇసుకను తవ్వడంలో నిబంధనలను ఉల్లంఘిస్తునే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీలను కొండపాక చెరువు కట్ట మీదుగా తరలిస్తున్నారు. దీంతో కట్ట బలహీనపడి వర్షాకాలంలో తెగిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మానేరులో ఇసుక రీచ్ నిర్వహించేందుకు కాంట్రాక్టు దక్కించుకున్న రీచ్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.గ్రామీణ చెరువులపై రహదారులు ఏర్పాటు చేసుకుని ఇసుక రవాణా సాగిస్తున్న నిర్వాహకులు కొండపాక చెరువు శిఖం భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక కుప్పలు పోసి రీచ్ నిర్వహిస్తున్నారు.ఇసుక రీచ్ నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తు ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోకపోవడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం..

ఇసుక తరలిస్తున్న లారీలతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో ప్రధాన రోడ్డుపై ఇసుక లారీలు కిలోమీటర్ల మేర బారులు తీరి నిలిచిపోతున్నాయి. దీంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు భయపడుతున్నారు. లారీల డ్రైవర్లు క్లీనర్లు రోడ్లపై మలమూత్రాలు విసర్జించడం తో రోడ్లన్ని కంపుకోడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇసుక రీచ్ నిర్వాహకుల ఆగడాలపై ఎవరైనా నోరు తెరిస్తే ఇక అంతే వారి సంగతి అన్నట్లుగా తయారైంది. "ఇదేంటని అడిగితే క్వారీ యజమానులు బెదిరింపులు యాజమాన్యం డబ్బు బలం, నాయకుల అండ చూసుకుని బెదిరిస్తున్నారు" అని ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆకలితో అలమటిస్తున్న లారీ డ్రైవర్లు: ఎస్సై ఆవుల తిరుపతి

వీణవంక మండలంలో నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్న ఇసుకరీచుల పరిస్థితి ఇసుక తరలింపునకు వచ్చిన లారీ డ్రైవర్లకు శాపంగా మారింది. ఇసుక రీచ్ లో లోడింగ్ ప్రక్రియ వేగంగా సాగకపోవడం లారీల సంఖ్యకు సరిపడా లోడింగ్ చేసే యంత్రాలు అందుబాటులో లేకపోవడం ఇసుక రీచ్ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా ప్రధాన రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు బారులు తీరాయి. తమ వంతు ఎప్పుడు వస్తుందా అని మూడు రోజులుగా లారీ డ్రైవర్లు లారీలను రోడ్డు పక్కన నిలుపుకొని ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రామాలకు చివరలో లారీల నిలుపుదల రోడ్డుపై జరిగినప్పటికీ ఎలాంటి ఆహార వసతి అందుబాటులో లేకపోవడంతో పస్తులు ఉంటున్నామని లారీ డ్రైవర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు. ప్రధాన రహదారిపై బారులు తీరిన లారీలను వేగంగా ఇసుక రీచ్ నుంచి డి తరలించడానికి కృషి చేస్తున్నామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. లారీ డ్రైవర్లకు ఇసుక రీచ్ వద్ద భోజన వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డుపై వచ్చి పోయే వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా లారీలు తరలించాలని లారీ డ్రైవర్లకు సూచించారు.

Next Story