‘వీబీజీ రామ్ జీ’ వ్యవసాయానికి అనుసంధానం చేయాలి

by Malleboina Mahesh |

కేంద్రం తెచ్చిన ‘వీబీజీ రామ్ జీ’ చట్టంపై నేడు సెక్రటేరియట్‌లో మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. 40% నిధుల భారం, 60 రోజుల బ్రేక్ నిబంధనపై రాష్ట్రం అభ్యంతరం!

‘వీబీజీ రామ్ జీ’ వ్యవసాయానికి అనుసంధానం చేయాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్​జీ చట్టాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. కానీ ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు మార్చాలని, రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్​జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయక తప్పనిసరి పరిస్థితి ఉందని ప్రభుత్వ అధికారులు గుర్తించారు. ఈ చట్టం అమలు చేయకుంటే రాష్ట్రంలో లక్షలాది మంది కూలీలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. పథకాన్ని రాష్ట్రంలో అమలు పై కేబినెట్​ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ఒకసారి సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం శనివారం మరోసారి సచివాలయంలో భేటీ కానుంది. ఈనెల 28న ఢిల్లీలో రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్​చౌహాన్,​ఈనెల 29న రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రం నుంచి మంత్రి సీతక్క, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్​హాజరుకానున్నారు. జులై 1 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయాలని ఇప్పటికే కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించే సమావేశాలు కీలకం కానున్నాయి.

రాష్ట్రం అభ్యంతరాలివే..

వీబీజీ రామ్ జీ చట్టంలో ప్రధానంగా ఉన్న 40 శాతం వ్యయాన్ని రాష్ట్రాలు భరించాలని కేంద్రం చట్టంలో పొందుపర్చింది. దీనితో రాష్ట్రంపై దాదాపు రూ.2500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రాలపై భారం వేసే చట్టాన్ని మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. గతంలో అసెంబ్లీలో తీర్మానం సైతం చేసి కేంద్రానికి పంపించినా పరిగణలోకి తీసుకోలేదు. ప్రధానంగా వ్యవసాయ పనులు జరిగే 60 రోజుల పాటు ఉపాధి పనులను నిలిపివేయాలని కేంద్రం కొత్త చట్టంలో పేర్కొన్నది. ఈ నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వ్యవసాయ పనులు జరిగే రోజుల్లో సైతం ఉపాధి హామీ పనులు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. వానాకాలంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం ఉపాధి హామీ కిందికి వస్తాయి. వాటికి ఉపాధి హామీ నుంచే నిధులను చెల్లిస్తారు.

కేంద్రమే భరించాలి

గిరిజన ప్రాంతాలుగా ఉన్న ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, భద్రాచలం, ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, అచ్చంపేట, దేవరకొండ తదితర ప్రాంతాల్లోని గిరిజనులకు ఉపాధి హామీ పనులే ఆధారంగా మారాయి. వారికి వ్యవసాయం భూములు లేకపోవడం, అక్కడ తక్కువ వ్యవసాయ పనులు జరుగుతాయి. హిమాచల్​ప్రదేశ్​లాంటి కొండలు, గుట్టలు ఉండే రాష్ట్రాలకు 90:10 శాతం ఇస్తున్నారని, ఇక్కడా అదే విధంగా కేంద్రం 90 శాతం నిధులు భరించాలని కోరుతున్నారు. ఈ పథకాన్ని మరుగుదొడ్లు, ఇందిరమ్మ ఇళ్లకు సైతం అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిందరికీ 60 రోజుల నిబంధన ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో షెడ్యూల్​5 కింద ఉన్న ప్రాంతాల్లో అయ్యే వ్యయాన్ని 90 శాతం కేంద్రం భరిస్తుందని, ఇక్కడా షెడ్యూల్​ 6 ఏరియాలో తెలంగాణలోనూ ఉన్నాయని, గిరిజన ప్రాంతాల్లో అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని కోరనున్నారు.

Next Story