హైవే పక్కన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ప్రమాదమా? మరేదైనా మిస్టరీనా?

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-27 04:59:28  IST  )

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యమవటం కలకలం రేపింది.

హైవే పక్కన ఇద్దరు కూలీల మృతదేహాలు.. ప్రమాదమా? మరేదైనా మిస్టరీనా?
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యమవటం కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతులను బీహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్, శివాజీగా గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతులిద్దరూ గత రెండేళ్లుగా కోదాడలోని ఓ రైస్‌మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి మద్యం సేవించిన అనంతరం ద్విచక్ర వాహనంపై కోదాడ వైపు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

అయితే జాతీయ రహదారి పక్కనే మృతదేహాలు, వాటి సమీపంలో ద్విచక్ర వాహనం, దుస్తులు కనిపించడంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం రోడ్డు ప్రమాదమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు కోదాడ సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా మృతికి గల అసలు కారణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Next Story