Rama Rajamouli: బాహుబలి ఫ్లాప్ అయితే ఆ పని చేయాలనుకున్నాం

by Pulgam srinivas |

'బాహుబలి 1'కి ఫ్లాప్ టాక్ రావడంతో మణికొండలోని తమ స్థలాన్ని అమ్మాలని కూడా అనుకున్నామని రమా వెల్లడించారు.

Rama Rajamouli: బాహుబలి ఫ్లాప్ అయితే ఆ పని చేయాలనుకున్నాం
X

దిశ, వెబ్ డెస్క్: కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' చిత్రాలు భారతీయ సినీ చరిత్రలో సంచలన విజయాలు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రూపుదిద్దుకున్న తీరు, విడుదల సమయంలో ఎదురైన సవాళ్లు, ఆ ప్రయాణంలోని ఆసక్తికర సంఘటనలను వివరిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో భాగంగా 'బాహుబలి: ది బిగినింగ్' విడుదలైన తొలి రోజు ఎదురైన పరిస్థితుల గురించి రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఆమె మాట్లాడుతూ... "బాహుబలి మొదటి భాగాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాం. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం మాకు మొదటి నుంచే ఉంది. కానీ విడుదలైన తొలి రోజు ఊహించని విధంగా నెగిటివ్ టాక్ రావడంతో పాటు ఫ్లాప్ అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మేమంతా తీవ్ర షాక్‌కు గురయ్యాం. భారీ పెట్టుబడితో సినిమా నిర్మించాం కాబట్టి నిర్మాతలకు నష్టం వస్తుందేమోనని చాలా ఆందోళన చెందాం. వారిని ఎలా ఆదుకోవాలనే విషయమే మా ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది.

ఆ సమయంలో మణికొండలో మాకు ఉన్న స్థలాన్ని అమ్మి నిర్మాతలకు సహాయం చేయాలని కూడా అనుకున్నాం. ఆ స్థలం అమ్మితే వచ్చే డబ్బుతో పూర్తిగా నష్టాన్ని భర్తీ చేయలేమని తెలిసినా, మా దగ్గర ఉన్న ఏకైక మార్గం అదే. అయితే అదృష్టవశాత్తూ సినిమా ఆ తర్వాత పుంజుకుని భారీ విజయాన్ని అందుకుంది" అని రమా రాజమౌళి తెలిపారు. ఇక 'బాహుబలి: ది బిగినింగ్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, 'బాహుబలి: ది కన్‌క్లూజన్' ప్రపంచవ్యాప్తంగా ₹1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Next Story