సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ మిత్రుడు సురేష్.. పరారీలో పోలీసులు!

by Ramesh Naini |

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ (కృష్ణలంక రాజీవ్‌నగర్‌) రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి కస్టోడియల్ డెత్ వ్యవహారంపై సిట్ (SIT) విచారణ వేగవంతమైంది.

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ మిత్రుడు సురేష్.. పరారీలో పోలీసులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ (కృష్ణలంక రాజీవ్‌నగర్‌) రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి కస్టోడియల్ డెత్ వ్యవహారంపై సిట్ (SIT) విచారణ వేగవంతమైంది. ఈ కేసులో కీలక పరిణామంగా.. పరారీలో ఉన్న సీఐ నాగరాజు స్నేహితుడు సురేష్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతడిని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తూ కీలక సమాచారాన్ని రాబడుతున్నట్లు అధికార వర్గాల సమాచారం.

సురేష్ పాత్రపై ముమ్మర విచారణ..

సాయికృష్ణ లాకప్‌ డెత్‌ అనంతరం మృతదేహాన్ని మాయం చేయడంలోనూ, ఆ తర్వాత కుటుంబ సభ్యులతో రాజీకి రాయబారం నడపడంలోనూ సీఐ నాగరాజుకు సురేష్ పూర్తిగా సహకరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో అతడికున్న సంబంధాలు, లాకప్ డెత్ తర్వాత జరిగిన పరిణామాలపై సిట్ బృందం అతడిని లోతుగా ప్రశ్నిస్తోంది.

పరారీలో ఉన్న పోలీసుల కోసం గాలింపు..

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిల కోసం సెంట్రల్‌ డివిజన్‌ టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. వీరి కోసం ఈ బృందాలు ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లాయి. నిందితుల ఇళ్లకు నోటీసులు అంటించిన సిట్ అధికారులు.. తక్షణమే విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉన్నతాధికారులతో సిట్ భేటీ

ఈ ఘటనలో మరికొందరి పాత్రపై అనుమానాలు ఉండటంతో సిట్ అధికారులు డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్‌ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి, ఏసీపీ మానసలతో వేర్వేరుగా సమావేశమై వివరాలు సేకరించారు. మరోవైపు, మృతుడు సాయి కృష్ణ నేర చరిత్రపై కూడా దర్యాప్తు బృందం దృష్టి సారించింది. గత నెలలో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడం, ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుండటంతో సిట్ దర్యాప్తు ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story