- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోరుగా అక్రమ ఇసుక,మట్టి దందా!
అర్ధరాత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.

దిశ, సంస్థాన్ నారాయణపురం : అర్ధరాత్రులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే గుట్టలను మాయం చేస్తూ ఎర్ర మట్టి దందాతో అక్రమార్కులు భారీగా డబ్బులు వెనుకేసుకున్నారు. అయితే ఈ దందాకు స్థానిక పోలీసు రెవెన్యూ అధికారులు పూర్తి అండదండగా నిలుస్తూ తలా పాపం తిల పిడకడు అన్న చందంగా అక్రమ సంపాదనలో వారికి కూడా వాటా వెళ్తున్నట్లు స్థానికంగా జోరుగా ఆరోపణలు వస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా భారీగా అక్రమ ఇసుక,మట్టి రవాణా జరుగుతున్న పోలీసు,రెవెన్యూ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడం వెనక స్థానికంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
అర్ధరాత్రులు తరలింపు..
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక మేళ్లచెరువుకు గత సీజన్ లో వర్షాల కారణంగా భారీగా నీరు చేరుకుంది . అయితే మేళ్లచెరువుకు వచ్చే కాలువలలో భారీగా ఇసుకమేటలు ఏర్పడడంతో ఇప్పుడు అక్రమార్కుల కన్ను వాటిపై పడింది. దీంతో అర్ధరాత్రులు అక్రమంగా జెసిబి సహాయంతో ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు ఇసుకకు 5 నుండి 7వేల రూపాయలు వసూలు చేస్తూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమార్కులు భారీగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు,రెవెన్యూ అధికారుల సహకారంతో...?
అయితే ఇప్పటికే సంస్థాన్ నారాయణపురం మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి,ఇసుక దందాపై వివిధ పార్టీల నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా కూడ పోలీస్,రెవెన్యూ అధికారులు వీరిపై చర్యలు తీసుకోకపోగా పూర్తిగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూళ్ల మత్తులో పడి పోలీసు, రెవెన్యూ అధికారులు ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆధారాలతో సహా అక్రమ ఇసుక రవాణాను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన లైట్ తీసుకుంటున్నారు. అర్ధరాత్రిలు గస్తీ కాయాల్సిన పోలీసుల కంట ఈ అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు పడటం లేదా అనే ప్రశ్న పలువురిలో ఉత్పన్నమవుతుంది.ఇకనైనా పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకొని అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని వివిధ పార్టీల నాయకులు,ప్రజాసంఘాలు కోరుకుంటున్నాయి.






