- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదు.. రాహుల్ గాంధీపై ప్రణబ్ ముఖర్జీ కూతురు కామెంట్స్
రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదని, రాహుల్ గాంధీ అకస్మాత్తుగా అదృశ్యమయ్యే తీరుపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠా మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‍సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కొంత కాలం క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండి ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమవుతారని ఆమె తప్పుబట్టారు. రాజకీయం అంటే పార్ట్ టైమ్ జాబ్ కాదని ఇది ఏడాదిలో 365 రోజులు, రోజుకు 24 గంటలు చేయాల్సిన ఫుల్ టైమ్ జాబ్ అని అన్నారు. తాజాగా ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన షర్మిష్ఠా రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజులు ర్యాలీలు చేసి మాయమైతే ఎలా?
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి ఫలితాలు వచ్చాయి. కానీ దురదృష్టవశాతు రాహుల్ కొన్ని కార్యక్రమాలు చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారని, భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాజకీయం అనేది నిరంతర ప్రక్రియ. రెండు రోజులు వచ్చి, కొన్ని ర్యాలీలు నిర్వహించి, నలుగురిని కలిసి ఆ తర్వాత వెళ్లిపోతాను అంటే కుదరదన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ముఖచిత్రంగా మారిన నాటి నుంచే పార్టీ పరాజయాలు మొదలయ్యాయన్నారు. 2014 నుండి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే ముఖచిత్రంగా ఉన్నారు. అప్పటి నుండి పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూనే వస్తోందని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణ కలిగిన బలమైన నాయకుడని ఆయనకు వస్తున్న స్పష్టమైన మెజారిటీయే అందుకు నిదర్శనం అన్నారు. కానీ రాహుల్ గాంధీ అలాంటి మెజారిటీని కాంగ్రెస్‌కు తీసుకురాలేకపోతున్నారని ఇది ఖచ్చితంగా రాహుల్ గాంధీ వైఫల్యమే అని ఆమె కుండబద్దలు కొట్టారు.
పొత్తులపైనే ఆశలు.. సొంత బలంపై శ్రద్ధ లేదు:
కాంగ్రెస్ పార్టీ కేవలం కూటములు, పొత్తుల ద్వారానే ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం లేదని షర్మిష్ఠా ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్‌లో పనిచేసిన సమయంలోనూ ఇదే ధోరణిని గమనించానని సొంత బలంతో గెలవాలనే ఉత్సాహం, ప్రోత్సాహం ప్రస్తుత నాయకత్వంలో కనిపించడం లేదని ఆమె విమర్శించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి మధ్య పోలీక చెప్పేందుకు ఆమె నిరాకరించారు.






