- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్షల్లో అత్తెసరు మార్కులు.. అయినా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన పేరెంట్స్
నేటికాలంలో మార్కుల కోసం పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్న తరుణంలో, ముంబయికి చెందిన ఒక దంపతులు సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : పబ్లిక్ పరీక్షల్లో 99 శాతం కంటే ఏ ఒక్క మార్కు తగ్గినా పిల్లలను ఒత్తిడికి గురిచేస్తూ, తల్లిదండ్రులే ముందుగా దిగాలుపడిపోయే ఈ రోజుల్లో.. ముంబయికి చెందిన ఒక దంపతులు తమ కొడుకుకు కొద్దిపాటి మార్కులే వచ్చినా వేడుకలా జరుపుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
55 శాతం మార్కులకే పెద్ద పండగ
నేటికాలంలో మార్కుల కోసం పిల్లలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో, ముంబయికి చెందిన ఒక దంపతులు సమాజానికి సరికొత్త సందేశాన్ని ఇచ్చారు. తమ పిల్లాడు పదో తరగతి పరీక్షల్లో కేవలం 55 శాతం మార్కులు తెచ్చుకున్నప్పటికీ, ఆ తక్కువ మార్కులకే వారు ఏకంగా ఇంట్లో పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించారు. సాధారణంగా తక్కువ మార్కులు వస్తే మందలించే తల్లిదండ్రుల మధ్య.. వీరు మాత్రం తమ కొడుకు సాధించిన విజయానికి సంతోషపడుతూ, ఏకంగా ఆ అబ్బాయి మార్కుషీటు (మార్కుల జాబితా) ఆకారంలోనే ఒక ప్రత్యేకమైన కేక్‌ను తయారుచేయించి మరీ కట్ చేయించడం విశేషం.
జైద్ భయం - తల్లిదండ్రుల భరోసా
ఇటీవలే విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ముంబయికి చెందిన వశీం పటేల్, షబ్నం దంపతుల కుమారుడు మహమ్మద్ జైద్‌కు మొత్తం 500 మార్కులకు గాను 276 మార్కులు వచ్చాయి. ఇది ఇంచుమించుగా 55 శాతం స్కోరు. అయితే, సమాజంలో మార్కులకు ఉన్న డిమాండ్ చూసి, తన మార్కుషీటును తల్లిదండ్రులకు చూపించడానికి జైద్ మొదట ఎంతో భయపడ్డాడు. కానీ, ఆ మార్కులను చూసిన అతని తల్లిదండ్రులు ఏమాత్రం కోప్పడకుండా, అతడిని ప్రేమగా దగ్గరకు హత్తుకున్నారు. "నువ్వు పరీక్షల్లో పాసయ్యావు కదా.. మాకు అంతే చాలు" అంటూ కొడుకులో ఉన్న భయాన్ని పోగొట్టి కొండంత భరోసానిచ్చారు. కొడుకు పాసైన ఆనందంలో ఆ దంపతులు అదే రోజు తమ బంధువులందరినీ పిలిచి ప్రత్యేకంగా ఒక పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో మార్కుషీటు తరహా కేక్‌ను కట్ చేయించి సరికొత్తగా సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకకు వచ్చిన బంధువులు, స్నేహితులు సైతం ఆ తల్లిదండ్రుల ఆలోచనా విధానాన్ని ఎంతగానో అభినందించారు.






