TG: తెలంగాణ ప్రగతిపై రాజస్థాన్ బృందం ప్రశంసలు

by Gantepaka Srikanth |

భూ నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణలో టీజీఐఐసీ అమలు చేస్తున్న సరళీకృత విధానాలను రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (రీకో) ఎండీ శివంగి స్వర్ణకార్ ప్రశంసించారు.

TG: తెలంగాణ ప్రగతిపై రాజస్థాన్ బృందం ప్రశంసలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణలో టీజీఐఐసీ అమలు చేస్తున్న సరళీకృత విధానాలను రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (రీకో) ఎండీ శివంగి స్వర్ణకార్ ప్రశంసించారు. తెలంగాణలోని ఐటీ, లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలుస్తోందని ఆమె కొనియాడారు. రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన రీకో ఉన్నత స్థాయి బృందం శుక్రవారం రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక, ఐటీ హబ్‌లలో పర్యటించింది. రీకో మేనేజింగ్ డైరెక్టర్ శివంగి స్వర్ణకార్ నేతృత్వంలోని ఈ బృందం.. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాజస్థాన్ బృందం హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, జీనోమ్ వ్యాలీలతో పాటు రావిర్యాల, మహేశ్వరం (ఈ-సిటీ)లోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)ను సందర్శించింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం, టీజీఐఐసీ ప్రధాన కార్యాలయంలో సంస్థ ఎండీ కె. శశాంక, ఇతర విభాగాధిపతులతో రాజస్థాన్ బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్- విజన్ 2047 లక్ష్యాలను కె. శశాంక వివరించారు. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని సాధిస్తూనే, రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దూరదృష్టితో కూడిన మార్గదర్శకత్వమే రాష్ట్ర పారిశ్రామిక విజయానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

Next Story