ఆ ఆలయంలో ప్రసాదంగా డబ్బులు!

by Muthe.Rajitha |

రాజస్థాన్ రాష్ట్రం చిత్తోడ్‌గఢ్ జిల్లాలోని బానోడా బాలాజీ గుడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లను ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ఆ ఆలయంలో ప్రసాదంగా డబ్బులు!
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఆలయాల్లో తీర్థం, లడ్డూ, బెల్లం లాంటివి ప్రసాదంగా పంచుతారు. కానీ ఒక ఆలయంలో ప్రసాదంగా డబ్బులు పంచుతారు. ఆ డబ్బులో ఇంట్లో భద్రపరిస్తే.. సిరిసంపదలు వృద్ధి చెందుతాయనే నమ్మకంతో వేలాది మంది ఆ గుడికి తరలివస్తుంటారు. రాజస్థాన్ రాష్ట్రం చిత్తోడ్‌గఢ్ జిల్లాలోని బారి సాద్రి ప్రాంతంలో వెలసిన బానోడా బాలాజీ ఆలయం, దేశంలోని ఇతర దేవాలయాల కంటే భిన్నమైన ఆచారానికి వేదికగా నిలుస్తోంది. ఈ గుడికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లను ప్రసాదంగా పంపిణీ చేస్తారు. భక్తులు సమర్పించిన విరాళాలనే ఆలయ కమిటీ తిరిగి భక్తులకు పంపిణీ చేస్తోంది. ఈ ఆలయంలో లభించే కరెన్సీ నోట్లను భక్తులు కేవలం డబ్బుగా కాకుండా, హనుమంతుడి దీవెనలతో కూడిన 'మహాలక్ష్మి' రూపంగా భావిస్తారు. ఇలా ప్రసాదంగా దక్కిన నోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేయకూడదనేది ఇక్కడి ప్రధాన నియమం.

భక్తులు ఆ నోట్లను తమ పూజా గదుల్లో, వ్యాపార సంస్థల బీరువాల్లో అత్యంత భక్తితో భద్రపరుచుకుంటారు. దీనివల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని, ఆపదలు తొలగిపోయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. ముఖ్యంగా దీపావళి వంటి పర్వదినాల్లో ఈ ప్రసాదం కోసం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ సంప్రదాయం వల్ల ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. కేవలం రాజస్థాన్‌ నుంచే కాకుండా పొరుగున ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ 'డబ్బు ప్రసాదం' కోసం ఇక్కడికి వస్తుంటారు. తమ కోరికలు నెరవేరిన వారు పెద్ద ఎత్తున నగదును స్వామికి మొక్కుబడిగా చెల్లిస్తారు, ఆ మొత్తమే మళ్లీ భక్తులకు ప్రసాదంగా పంచబడుతోంది.

Next Story