నగరంలో వర్షాల ఎఫెక్ట్.. గాంధీ ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల వల్ల డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది.

నగరంలో వర్షాల ఎఫెక్ట్.. గాంధీ ఆస్పత్రికి పోటెత్తుతున్న రోగులు
X

దిశ, వెబ్ డెస్క్: రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి రాష్ట్రం మొత్తం విస్తరించాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారడంతో నగరవాసులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. గత రెండు రోజులుగా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల (Viral Fevers) కేసులు ఒక్కసారిగా వేగంగా పెరుగుతుండటంతో సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ గాంధీ జనరల్ ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. జ్వర పీడితులతో ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ (OP) వార్డులు, జనరల్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి.

ఆ రెండు వ్యాదుల లక్షణాలతోనే ఎక్కువ మంది

ఆసుపత్రికి వస్తున్న రోగులలో అత్యధికులు తీవ్రమైన ఒంటి నొప్పులు, జ్వరం, ప్లేట్‌లెట్స్ పడిపోవడం వంటి డెంగ్యూ, మలేరియా లక్షణాలతోనే వస్తున్నట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. రోజువారీ ఓపీ సంఖ్య సాధారణం కంటే రెండింతలు పెరిగిందని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక జ్వరాల వార్డులను, అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వర్షాల కారణంగా నివాస ప్రాంతాల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు నగర ప్రజలను అప్రమత్తం చేశారు.

Next Story