- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షమా... రోగాల వరదమా?
ఆకాశం మేఘావృతమై తొలి చినుకు పడగానే జనం మనసంతా వేడివేడి బజ్జీలు, సమోసాలు, చాట్, బిర్యానీల వైపు మళ్లుతుంది. కానీ ఆ రుచి వెనుక ప్రాణాంతక రోగాలు పొంచి ఉన్నాయనే నిజాన్ని చాలామంది విస్మరిస్తున్నారు.

దిశ, సికింద్రాబాద్ : ఆకాశం మేఘావృతమై తొలి చినుకు పడగానే జనం మనసంతా వేడివేడి బజ్జీలు, సమోసాలు, చాట్, బిర్యానీల వైపు మళ్లుతుంది. కానీ ఆ రుచి వెనుక ప్రాణాంతక రోగాలు పొంచి ఉన్నాయనే నిజాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో పాటే రోడ్ సైడ్ ఫుడ్ (వీధి ఆహారం) ద్వారా ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు ముంచెత్తుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో వీధి ఆహార నాణ్యతను పర్యవేక్షించాల్సిన ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత) అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో తనిఖీలను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లేట్ ఫుడ్... బోనస్సగా రోగాలు..!
వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రోడ్ల పక్కన తెరిచి ఉంచే ఆహార పదార్థాలపై ఈగలు వాలడం, దుమ్ము పడటం సర్వసాధారణం. వీటికి తోడు కలుషిత నీటితో చేసే పానీపూరి, జ్యూస్‌లు, ఐస్ క్రీమ్‌ల వల్ల టైఫాయిడ్, కలరా, గ్యాస్ట్రో ఎంటరైటిస్ (వాంతులు, విరేచనాలు), కామెర్లు (హెపటైటిస్-ఎ) వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రులన్నీ ఇప్పటికే ఇలాంటి బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి.
నాణ్యత ‘సున్నా’... లాభాలే ‘మిన్న’..
చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారులు కనీస పరిశుభ్రత పాటించడం లేదు. కుళ్లిన కూరగాయలు, నాణ్యత లేని నూనెలు, రసాయన రంగులను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అది క్యాన్సర్‌కు దారితీసే టాక్సిన్‌గా మారుతోంది. వంట చేయడానికి, ప్లేట్లు కడగడానికి మురికి కాలువల పక్కన ఉండే నల్లా నీటిని, బోరు నీటిని వాడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయినా సరే, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించడమే ధ్యేయంగా వ్యాపారాలు సాగుతున్నాయి.
ఫుడ్ సేఫ్టీ’ నిద్రపోతోందా..?
ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఆహార భద్రతా అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. సికింద్రాబాద్, లాలాగూడ, లాలాపేట తదితర ప్రాంతాల్లో హోటళ్లు, రోడ్ సైడ్ బండ్లు ఉంటే, తనిఖీలు చేసే అధికారుల సంఖ్య వేళ్ల మీద లెక్కించదగ్గదే ఉంది. సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ అధికారులు ఏటా వర్షాకాలంలో నామమాత్రపు తనిఖీలతో సరిపెట్టుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. . ఏదైనా పెద్ద ఘటన జరిగి, ప్రజలు ఆసుపత్రి పాలైనప్పుడు మాత్రమే మీడియా ముందు హడావుడి చేయడం, ఆ తర్వాత మామూలే అన్నట్లు వ్యవహరించడం అధికారులకు అలవాటుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.






