గ్రామ పంచాయతీ, వీఓ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

by Kodari Anjali |

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాలపురం గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

గ్రామ పంచాయతీ, వీఓ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
X

దిశ, పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమాలపురం గ్రామంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనంతో పాటు, విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవన నిర్మాణ పనులకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. స్థానిక సర్పంచ్ జున్ను కనకయ్యతో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు. ఈ రెండు భవనాల నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ. 30 లక్షల నిధులను మంజూరు చేసింది.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం క్రమంగా నెరవేరుస్తోందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అర్హులైన గృహాలకు ఉచిత కరెంట్ సరఫరా అందిస్తున్నామని గుర్తుచేశారు.

ప్రత్యేకంగా వీఓ బిల్డింగ్‌ను సాంక్షన్...

నిరుపేదల సొంతింటి కల నిజం చేయడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టామని, జమాలపురం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు కింద 25 ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులతో పాటు, నూతన పింఛన్లు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు జీరో వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళలు తమ సంఘాల కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వీలుగానే ప్రత్యేకంగా వీఓ బిల్డింగ్‌ను సాంక్షన్ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిధుల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యూబ్, ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు, తహసిల్దార్ (ఎమ్మార్వో) వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీఓ శేషాంజన్ స్వామి, ఎస్సై ప్రవీణ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు. వీరితో పాటు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మట్టపెల్లి వెంకటేశ్వర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story