- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణి అర్జీలను పరిష్కరించకుంటే కఠిన చర్యలు: కలెక్టర్
ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించకుండా అలసత్వం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

దిశ, గద్వాల కలెక్టరేట్: ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించకుండా అలసత్వం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 29 ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించడం జరిగిందన్నారు. మండల స్థాయిలోనూ వచ్చిన ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పోర్టల్ లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీల వివరాలను అప్లోడ్ చేస్తుండడంతో రాష్ట్రస్థాయిలోనూ ఉన్నతాధికారులు వీటిని పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఆర్జీలు పెండింగ్ లో ఉంచడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం వివిధ శాఖల అధికారులు తమ సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే సోమవారంలోగా పెండింగ్ లో ఉన్న ఆర్జీలను పరిష్కరించాలని, అలసత్వం చూపే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రజావాణి పోర్టల్ లో లాగిన్ అయి తమకు సంబంధించిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ...
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫరాల పంపిణి ప్రక్రియ బూత్ లెవెల్ అధికారుల పని తీరును మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. విద్యాలయాలు, వసతిగృహాలను సంబంధిత అధికారులు తరచు సందర్శిస్తూ, అక్కడి కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో మూడు చొప్పున ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తున్నామని, అక్కడి సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు మరమ్మత్తుల పనులు కూడా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు సకాలంలో పనులు పూర్తయ్యేలా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు అందజేయడం జరిగిందని సాధ్యమైనంత తొందరగా యూనిఫామ్స్ కూడా ఇచ్చేలా స్టిచ్చింగ్ వేగవంతం చేయించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






