దేవేందర్ నగర్ దాడి కేసులో 13 మంది అరెస్ట్..

by Kodari Anjali |

బోడుప్పల్‌లోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశ వేడుక సందర్భంగా జరిగిన దాడి ఘటనలో 13 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.

దేవేందర్ నగర్ దాడి కేసులో 13 మంది అరెస్ట్..
X

దిశ,మేడిపల్లి: బోడుప్పల్‌లోని దేవేందర్ నగర్ కాలనీలో గృహప్రవేశ వేడుక సందర్భంగా జరిగిన దాడి ఘటనలో 13 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 27న రాత్రి 8 గంటల సమయంలో అనూప్ కుమార్ తన నివాసంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా, అంతకుముందు జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకుని చంపాలనే ఉద్దేశంతో 15 నుంచి 20 మంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకున్నారు. వారు కర్రలు, హాకీ స్టిక్స్‌తో అనూప్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు బయట పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేసి పరారయ్యారు.

మిగతా నిందితులను కూడా త్వరలోనే...

ఈ ఘటనను సమీపంలో నివసిస్తున్న విలేకరి విష్ణు గౌడ్ తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఆయనపై కూడా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్లు 935,937/2026 కింద రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కింది 13 మంది నిందితులను జూన్ 28 రాత్రి అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన నిందితులు వసురి సాయి కుమార్ (33), పులి ప్రదీప్ కుమార్ (32), కేమిడి రామకృష్ణ (23), కొమ్ము వేణు (21), ఆరుట్ల సుశాంత్ రెడ్డి (25), తాటికాయల విష్ణు (23), కుంకుడుపాముల ఉదయ్ కుమార్ (22), మహమ్మద్ అక్తర్ (25), మేడికొండ సంతోష్ కుమార్ (24), కదురు సాయి తేజ (21), అకునురి అరుణ్ (20), తొండ మహేష్ (32), వసురి యాకయ్య (60). ఈ కేసులో పాల్గొన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ డి. జలందర్ రెడ్ తెలిపారు.

Next Story