- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన చేపట్టాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
జలమండలి పరిధి క్యూర్ వరకు విస్తరిస్తున్న భవిష్యత్ తాగునీటి అవసరాల దృష్ట్యా చేపడుతున్న ప్రాజెక్టులను సమగ్ర దృష్టితో ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : జలమండలి పరిధి క్యూర్ వరకు విస్తరిస్తున్న భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్ట్యా చేపడుతున్న ప్రాజెక్టులను సమగ్ర దృష్టితో ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం గోదావరి ఫేజ్-2 & 3 ప్రాజెక్టులు, నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ముందుగా ఖానాపూర్‌లో నిర్మాణంలో ఉన్న గోదావరి ఫేజ్-2 & 3 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) పనుల పురోగతిని సమీక్షించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం నియోపోలీస్ సమగ్ర మంచినీటి సరఫరా కోసం ప్రతిపాదించిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్, డబ్ల్యూటీపీ నిర్మాణ పనులను ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా మౌలిక వసతులకు తగిన స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నియోపోలీస్ ప్రాంతంలో నిర్మిస్తున్న రెండు 2.5 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా గ్రావిటీ పద్ధతిలో ఏయే ప్రాంతాలకు నీటి సరఫరా చేయవచ్చో సమీక్షించారు.
భూమి విలువ అధికంగా ఉన్న నేపథ్యంలో.. భవిష్యత్ విస్తరణను దృష్టిలో ఉంచుకుని రిజర్వాయర్లను బహుళ అంతస్తుల నిర్మాణ నమూనాలో రూపొందించే అవకాశాలను సాంకేతికంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం అవసరమైన నిర్మాణ ప్రొవిజన్ మాత్రమే కల్పించి, భవిష్యత్ విస్తరణను ప్రత్యేక టెండర్ల ద్వారా చేపట్టే విధానంపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే ప్రధాన పైప్‌లైన్‌ల అనుసంధానం, గ్రావిటీ ఆధారిత నీటి ప్రవాహం, రోడ్డు పనులకు అంతరాయం కలగకుండా ముందస్తు పైప్‌లైన్ ప్రొవిజన్లు, కనీసం ఒక రోజు అవసరానికి సరిపడే రన్నింగ్ స్టోరేజ్ ఏర్పాటు వంటి అంశాలపై సమగ్ర సాంకేతిక అధ్యయనం నిర్వహించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో అవాంతరాల పరిస్థితుల్లో కూడా నగర తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ అంశాలపై కన్సల్టింగ్ ద్వారా సాంకేతిక సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించి, భవిష్యత్ విస్తరణ, అదనపు నిల్వ సామర్థ్యం, వ్యయ ప్రయోజనాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్ నెట్‌వర్క్ ను సమర్థవంతంగా వినియోగించి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా తాగునీరు సరఫరా చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. అంతకుముందు హెచ్‌ఎండీఏ అధికారులతో కలిసి ఖానాపూర్ సమీపంలో ప్రతిపాదిత రహదారి నిర్మాణానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 1200 ఎంఎం డయా తాగునీటి పైప్‌లైన్ షిఫ్టింగ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎం రాజశేఖర్, జనరల్ మేనేజర్లు, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, సైట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.






