చెరువులను తలపిస్తున్న నాంపల్లి రోడ్లు

by Batti.Sumithra |

నాంపల్లి మండల కేంద్రంలోని పలు రహదారులు వర్షం కురిసిన ప్రతిసారీ చెరువులను తలపిస్తున్నాయి.

చెరువులను తలపిస్తున్న నాంపల్లి రోడ్లు
X

దిశ, నాంపల్లి : నాంపల్లి మండల కేంద్రంలోని పలు రహదారులు వర్షం కురిసిన ప్రతిసారీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా అంబేద్కర్ చౌరస్తా నుంచి గుర్రంపోడు వెళ్లే ప్రధాన రహదారి పై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ రహదారికి మరమ్మతులు చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగు నీరు రోడ్ల పైకి చేరి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ నుంచి రచ్చబండ వరకు ఉన్న సీసీ రోడ్డు పై కూడా వర్షపు నీరు నిల్వ ఉండడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అదేవిధంగా పద్మశాలి కాలనీ, ముదిరాజుల కాలనీల్లో పందుల సంచారం అధికంగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. నాగులమ్మ చెరువు కట్ట చివర ఉన్న అంగన్‌వాడీ కేంద్రం పరిసరాల్లో మురుగునీరు, చెత్త చెదారం పేరుకుపోయి పందులు సంచరిస్తుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అక్కడ చదువుతున్న చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి మెదడువాపు వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించాలని సీపీఎం మండల నాయకులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story