పంచాయతీ నిధులు పక్కదారి..?

by Kodari Anjali |

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై వివాదం నెలకొంది.

పంచాయతీ నిధులు పక్కదారి..?
X

దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మేడిపల్లి గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై వివాదం నెలకొంది. 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.6 లక్షల మేర ఖర్చు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ, ఆ పనులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ రికార్డుల ప్రకారం వీధి దీపాల కొనుగోలు, సబ్‌మర్సిబుల్ మోటార్ల మరమ్మతులు, కొత్త మోటార్ల కొనుగోలు, ఫాగింగ్ మిషన్, జంగిల్ క్లియరెన్స్, ట్రాక్టర్ మరమ్మతులు, ఫర్నిచర్, కార్యాలయ నిర్వహణ తదితర పనులకు భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్లు నమోదైందని గ్రామస్తులు తెలిపారు. అయితే, వాటిలో అనేక పనులు గ్రామంలో పూర్తిగా జరగలేదని లేదా అసలు కనిపించడం లేదని ఆరోపించారు. వీధి దీపాల కొనుగోలు, ఫిట్టింగ్ పేరుతో దాదాపు రూ.45 వేల వరకు ఖర్చు చూపించినప్పటికీ, గ్రామంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ వీధి దీపాలు ఏర్పాటు కాలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. మోటార్ల మరమ్మతులకు నిధులు ఖర్చు చేసిన కొద్ది రోజులకే కొత్త మోటార్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు కావడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

ప్రత్యేక సాంకేతిక కమిటీతో క్షేత్రస్థాయిలో..

జంగిల్ క్లియరెన్స్ పనులకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు అధికారిక రికార్డులు చూపుతుండగా, అదే పనులను సర్పంచ్ స్వంత నిధులతో నిర్వహించినట్లు స్థానికంగా ప్రచారం జరగడం వల్ల అసలు ఏ నిధులతో పనులు జరిగాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. అదేవిధంగా, గ్రామపంచాయతీ వ్యవహారాల్లో సర్పంచ్ భర్త ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటూ నిధుల వినియోగం, పనుల అమలులో కీలక పాత్ర పోషిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ అంశాలను గ్రామసభలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ సాంక్షన్లు, టెక్నికల్ సాంక్షన్లు, వర్క్ ఆర్డర్లు, మెజర్‌మెంట్ బుక్స్ (ఎంబీలు), జీఎస్టీ బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, బ్యాంకు లావాదేవీలు, ఫొటోలు తదితర రికార్డులను పరిశీలించి జిల్లా స్థాయి ప్రత్యేక సాంకేతిక కమిటీతో క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story