దుబ్బాకలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో భారీ చోరీలు

by Ratna Kumari |

దుబ్బాక పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఒకేసారి మూడు ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడ్డారు.

దుబ్బాకలో ఒకే రాత్రి మూడు ఇళ్లలో భారీ చోరీలు
X

దిశ, దుబ్బాక : దుబ్బాక పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఆదివారం అర్ధరాత్రి ఒకేసారి మూడు ఇళ్లలో భారీ చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగులు ఇళ్ల కిటికీలను ధ్వంసం చేసి లోపలికి చొరబడి బీరువాల్లో దాచిన నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. స్థానికుల కథనం ప్రకారం, దుబ్బాక పట్టణంలోని 15వ వార్డుకు చెందిన మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు చింత రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన సమయంలో దొంగలు ఆయన ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం మరో రెండు ఇళ్లలోనూ చోరీలకు పాల్పడ్డారు. మొత్తం మూడు ఇళ్లలో సుమారు 1.5 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, రూ.8 లక్షల నగదు అపహరించినట్లు సమాచారం. సోమవారం ఉదయం చోరీ జరిగిన విషయం గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, ఏసీపీ రవీందర్ రెడ్డి, దుబ్బాక ఎస్సై కీర్తిరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి, వేలిముద్రలు సహా ఇతర ఆధారాలను సేకరించారు. ఈ సందర్భంగా సీపీ సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, చోరీ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేశామని తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా చోరీలను నివారించడంతో పాటు, ఇంటి యజమానులు లేని సమయంలో ఇంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుందని సీపీ సూచించారు. ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీలు జరగడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో పోలీసు గస్తీని మరింత పెంచి, నిఘాను పటిష్టం చేయాలని స్థానిక పోలీసులను సీపీ ఆదేశించారు.

Next Story