తల్లి కన్నీటి వినతి... "నా ఇంటిని నాకు తిరిగి ఇవ్వండి"

by Batti.Sumithra |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది.

తల్లి కన్నీటి వినతి... నా ఇంటిని నాకు తిరిగి ఇవ్వండి
X

దిశ, పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాల్సిన 75 ఏళ్ల మహిళ,తనకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమై జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించింది. కొత్తగూడెం పట్టణం 24వ డివిజన్ చమన్‌బస్తికి చెందిన మోగిలిపాక లక్ష్మి అనే వృద్ధురాలు, తనకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారని తెలిపింది. పెద్ద కుమారుడు సింగరేణిలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందాడని, కుటుంబానికి రెండు ఇళ్లు ఉన్నాయని వివరించింది. అయితే వృద్ధాప్యంలో అనారోగ్యంతో ఉన్న తనకు భర్తకు ఇంటి పట్టా దొంగిలించి మోసపూరితంగా తెలియకుండా, మిగతా సంతానానికి సమాచారం ఇవ్వకుండా, తన భర్త పేరు పై ఉన్న ఇంటిని పెద్ద కుమారుడు తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం తన బాగోగులు కూడా పట్టించుకోవడం లేదని, వృద్ధాప్యంలో ఆశ్రయం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

నా ఇంటిని నాకు తిరిగి ఇప్పించండి... నన్ను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ వృద్ధురాలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సీనియర్ సిటిజన్స్ చట్టం కింద న్యాయం చేయాలని కోరింది. వృద్ధురాలి గోడును ఓపికగా విన్న జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘటన మరోసారి వృద్ధుల హక్కులు, వారి సంరక్షణ, కుటుంబ బాధ్యతలపై సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. జీవితాంతం పిల్లల కోసం కష్టపడిన తల్లిదండ్రులు చివరికి న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి రావడం నిజంగా బాధాకరం. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వృద్ధుల ఆస్తి హక్కులు, పోషణ, రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన చట్టం. కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం లేదా మోసానికి గురైన వృద్ధులకు ఈ చట్టం ద్వారా న్యాయం పొందే అవకాశం ఉంది. ఈ కేసులో విచారణ అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story